Telangana Caste Census : నవంబర్ 6 నుంచి తెలంగాణలో సమగ్ర కుల గణన సర్వే - ముఖ్యమైన అంశాలు
Caste Census in Telangana : తెలంగాణలో కుల గణన సర్వే ప్రారంభం కానుంది. నవంబర్ 6వ తేదీ నుంచి షురూ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ బాధ్యతను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. మూడు వారాల పాటు సర్వే జరగనుంది. ఈ సర్వేలో భాగంగా.. ప్రతి ఇంటి నుంచి సమగ్ర వివరాలను సేకరిస్తారు.
కుల గణనపై తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. నవంబర్ 6వ తేదీ నుంచి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాట్లు సిద్ధం చేసింది. కుల గణన బాధ్యతలను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలపై సమగ్ర సర్వే నిర్వహించనుంది.
కుల గణన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు, ప్రభుత్వ సిబ్బందిపై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కుల గణనలో 36,549 మంది SGTలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు పాల్గొంటారని తెలిపింది. అంతేకాకుండా… 6256 మంది ఎంఆర్‌సీలు, 2 వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది కూడా భాగం కానున్నారు.
ఈ కుల గణన సర్వే నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు మినహాయింపు ఇచ్చారు. సర్వేలో పాల్గొనే ఉపాధ్యాయులు… ఆదివారమే కాకుండా… సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తం మూడు వారాల పాటు ఈ సర్వే జరగనుంది. .
కొంత కాలంగా తెలంగాణలో కుల గణన అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చింది. తొలుత బీసీ కుల గణనపై నిర్ణయం కూడా తీసుకుంది. అసెంబ్లీ వేదికగా తీర్మానం కూడా చేసింది. ఈ గణన తర్వాతే… స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రంలోని బీసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో బీసీ కుల గణన ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు కొద్దిరోజుల కింద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేస్తామని ప్రకటించింది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు.
ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈక్రమంలోనే హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా నియమించారు. ఉపకులాల వారీగా ఎస్సీల వెనకబాటుతనాన్ని ఈ కమిషన్ అధ్యయనం చేయనుంది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో ఈ కమిషన్ నివేదిక కూడా కీలకంగా మారనుంది.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే… ప్రభుత్వం సమగ్ర కుల గణనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా….బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కులాల వారీగా సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవలనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ప్రతి ఒక్కరూ సర్వేలో భాగం కావాలి - మంత్రి పొన్నం
కుల గణన ప్రక్రియపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ కుల గణన సర్వే జరుగుతుందని చెప్పారు. 85,000 మంది ఎన్యూమరేటర్లు ఉంటారని పేర్కొన్నారు. ప్రతి 10 మంది ఏనుమరేటర్లకు ఒక పరిశీలకుడు ఉంటారని వెల్లడించారు.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్టాయి అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటి నుంచి సమగ్ర సమాచాారాన్ని సేకరిస్తారని తెలిపారు. నవంబర్ 30వ తేదీలోపు సమాచార సేకరణ పూర్తి చేసే దిశగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
సంబంధిత కథనం