TG Caste Census : సర్వేలో పాల్గొనని వారికి మరో ఛాన్స్... ఫిబ్రవరి 16 నుంచి ‘కుల గణన’ సర్వే
తెలంగాణలో మరోసారి కుల గణన జరగనుంది. సర్వేలో పాల్గొనని వారికోసం ఫిబ్రవరి 16 నుంచి మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 28లోపు వివరాలు ఇవ్వొచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణలో కులగణనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… పలు కారణాల రీత్యా కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.
3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసమే మళ్లీ రీసర్వే చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సర్వేలో పాల్గొని… వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.
కొందరు ఉద్దేశపూర్వకంగా వివరాలు చెప్పలేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగా సర్వేకు సహకరించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా ఉందన్నారు.
బీసీల రిజర్వేషన్లపై మార్చి తొలి వారంలో కేబినెట్ తీర్మానం చేస్తామని భట్టి వివరించారు. శాసనసభ ముందుకు ఈ బిల్లును తీసుకువచ్చి…. చట్టబద్ధం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.
ఇటీవలే సర్వే గణాంకాలు:
ఇటీవలే కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,54,77,554 మందిని సర్వే చేసినట్లు వెల్లడించింది. మొత్తం 1,12,15,131 కుటుంబాల వివరాలు నమోదు చేసుకున్నాయని పేర్కొంది. కులగణన సర్వేలో పాల్గొన్న జనాభా 96.90 శాతం మాత్రమని తెలిపింది. సర్వేలో పాల్గొనని జనాభా 3.10 శాతంగా పేర్కొంది.
బీసీల జనాభా 46.25 శాతం ఉందని వెల్లడించింది. ఓసీలు 15.79 శాతం మంది ఉన్నారని… ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల జనాభా 56.33 శాతం ఉందని వెల్లడించింది.
ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వే శాస్త్రీయంగా జరగలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బీసీల జనాభా తగ్గించి చూపించారని…చాలా మంది సర్వేలో పాల్గొనలేదని పలు బీసీ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సర్వే సరిగా జరగలేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఇదే విషయంపై ప్రభుత్వానికి కూడా పలు విజ్ఞప్తులు అందాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న సర్కార్… మరోసారి సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.
సంబంధిత కథనం