FarmHouse Casino: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాలు.. పోలీసుల అదుపులో బడా బాబులు
FarmHouse Casino: హైదరాబాద్ శివార్లలో గుట్టుగా సాగుతున్న క్యాసినో, కోళ్ల పందాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో జరుగుతున్న దందాలో బడా బాబుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

FarmHouse Casino: హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న అక్రమ క్యాసినో, కోడి పందాల రాకెట్‌ను ఎస్వోటీ పోలీసులు ఛేదించారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. నగర శివార్లలో గుట్టుగా కోళ్ల పందాలు, క్యాసినోలపై సమాచారం అందుకున్న ఎస్వోటి పోలీసులు దాడులు చేసి జూదం ఆడుతున్న వారిని పట్టుకున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఫామ్ హౌస్‌పై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేసి, అక్రమ క్యాసినో మరియు కోడి పందాల ఆపరేషన్‌ను బయటపెట్టారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు.
పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు మరియు కోడి పందాల కోసం ఉపయోగించే 86 బెట్టింగ్ కోళ్లు, కోడి కత్తులనుస్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో పోకర్ చిప్స్ మరియు ఇతర జూదం సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
వ్యవస్థీకృత ముఠా నడుపుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్వహిస్తున్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూదంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.