Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు-cases registered against 11 people promoting betting apps in telugu states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు

Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11మందిపై కేసులు నమోదు

Sarath Chandra.B HT Telugu

Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో వర్దమాన నటులు, బుల్లితెర నటులు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కి యువత బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు

Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూ ట్యూబర్ లోకల్‌బాయ్‌ నానిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది.

యూట్యూబ్‌ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్‌ యాప్‌లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వల వేస్తున్నారు. ప్రమోషనల్ కోడ్స్‌ రూపంలో యువతకు వల వేసి వారి బెట్టింగులు ఆడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్‌ డబ్బులు పొందుతున్నారు. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఆర్థిక నేరాలు చాపకింద నీరులా సాగుతున్నాయి.

ఈ క్రమంలో బెట్టింగుల ఆడటం, డబ్బు పోగొట్టుకున్న తర్వాత పోయిన చోట వెదుక్కోవాలనే ధోరణితో అప్పుల పాలవడం, చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగాయి.

కొన్నేళ్లుగా బెట్టింగ్‌ యాప్‌‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుల్లి తెర నటులు, సినీ ప్రపంచంలో అవకాశాలను వెదక్కుంటున్న యువతులు ఈ ఆర్థిక నేరాల్లో పాల్గొంటున్నారు.

వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వందల,వేల కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉన్నఈ వ్యవహారంలో వేలాదిమంది చిక్కుకుని వాటి నుంచి బయట పడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న 11మందిపై తాజాగా సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో అజయ్, కిరణ్‌ గౌడ్, బయ్యాసన్నీ యాదవ్, విష్ణుప్రియ, సుప్రీత, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్‌, రీతూ చౌదరి, టేస్టీ తేజ, సుదీర్‌ రాజు తదితరులు ఉన్నారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసి వాటి నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న పలువురు సోషల్‌మీడియా, టీవీ నటులపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట  పోలీసులు  ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి, బండారు శేషాయని సుప్రీత, సుధీర్‌, అజయ్‌, సన్నీ యాదవ్‌, సందీప్‌ తదితరులపై  కేసు నమోదు చేశారు. వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం