VOA Legal Fight : సస్పెన్షన్ పై న్యాయపోరాటం - జనగామ మాజీ కలెక్టర్ సహా 12 మంది ఆఫీసర్లపై కేసు నమోదు..!
జనగామ జిల్లాకు చెందిన ఓ వీవోఏ పంతం నెగ్గించుకుంది. సస్పెన్షన్ కు కారణమైన అధికారులపై న్యాయపోరాటానికి దిగింది. రెండున్నరేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతుండగా… న్యాయస్థానం ఆదేశాలతో జనగామ మాజీ కలెక్టర్ సహా 12 మంది ఆఫీసర్లపై కేసు నమోదైంది. జనగామ జిల్లాలో ఈ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
అవినీతి ఆరోపణలతో తనను విధుల నుంచి తొలగించిన అధికారులపై కోర్టులో కేసు వేసిన జనగామ జిల్లాకు చెందిన ఓ వీవోఏ(గ్రామైక్య సంఘాల సహాయకురాలు) చివరకు తన పంతం నెగ్గించుకుంది. దాదాపు రెండున్నరేళ్ల పాటు జిల్లా అధికారుల అధికార దుర్వినియోగంపై పోరాటం చేసింది. చివరకు జనగామ జిల్లా కోర్టు ఆదేశాలతో గతంలో ఇక్కడ కలెక్టర్ గా పని చేసిన శివలింగయ్యతో పాటు మరో 11 మంది జిల్లా, మండల స్థాయి అధికారులు ఉన్నారు. సుమారు రెండున్నరేళ్ల పాటు పోరాటం చేయడం, ఇప్పుడు కోర్టు తీర్పుతో పూర్వ కలెక్టర్ సహా ఇతర అధికారులపై కేసు నమోదు కావడంతో జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
అసలేం జరిగింది..?
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన చాడ సునీత ఇదివరకు వీవోఏగా పని చేసింది. కాగా గ్రామైక్య సంఘానికి సంబంధించిన నిధుల విషయంలో 2020–21 సంవత్సరంలో చాడ సునీతపై అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఆ ఆరోపణల్లో నిజం లేదని, తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని అప్పట్లోనే సునీత మండల, జిల్లా స్థాయి అధికారులకు విన్నవించింది. అప్పట్లో జిల్లా కలెక్టర్ గా శివ లింగయ్య పని చేయగా.. విషయం ఆయన వరకూ వెళ్లింది. దీంతో వీవోఏ చాడ సునీత కలెక్టర్ శివ లింగయ్య దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆయన పట్టించుకోకపోగా.. సునీతను వీవోఏ విధుల నుంచి తొలగించారు. ఆ తరువాత కూడా తన తప్పులేని విషయాన్ని సునీత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు న్యాయ పోరాటానికి సిద్ధమైంది.
రెండున్నరేళ్లుగా పోరాటం
తనను అకారణంగా విధుల నుంచి తొలగించడంతో సునీత తీవ్ర వేదనకు గురైంది. ఈ మేరకు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటూ అమె అప్పట్లోనే జనగామ జిల్లా కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన కోర్టు… తాటికొండ గ్రామంలోని మహోదయ గ్రామైఖ్య సంఘానికి సంబంధించిన రికార్డులను పరిశీలించింది.
అందులో చాడ సునీత ఏ అక్రమాలకు పాల్పడలేదని గుర్తించింది. అకారణంగా సునీతను వీవోఏ బాధ్యతల నుంచి తొలగించినట్లు తేల్చింది. ఈ విషయంలో జనగామ జిల్లా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించి, వారందరిపై కేసులు నమోదు చేయాల్సిందిగా స్టేషన్ ఘన్ పూర్ పోలీసులకు ఈ నెల 22న ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాదాపు రెండున్నరేళ్ల పాటు పోరాటం చేసిన చాడ సునీత ఎట్టకేలకు విజయం సాధించి తన పంతం నెగ్గించుకున్నట్లయ్యింది.
12 మందిపై కేసు నమోదు
కోర్టు ఆదేశాలతో స్టేషన్ ఘన్ పూర్ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. అందులో అప్పటి కలెక్టర్ శివలింగయ్యతో పాటు డీఆర్డీవో రాంరెడ్డి, అడిషనల్ కలెక్టర్ హమీద్ అన్సారీ, ఏపీడీ నూరొద్దీన్, ఏపీఎం కవిత, డీపీఎం సమ్మక్క, డీపీఎం వరలక్ష్మి, ఇతర అధికారులు గోవర్ధన్, ఆనందం, పూర్ణచం దర్, బానోతు రాములు, ఎలేందర్ ఉన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులపై కేసు నమోదు కావడం జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్