Warangal SRSP Canal : వరంగల్ ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు-రెండేళ్ల బాబు మృతి, తండ్రి, కూతురు గల్లంతు-car plunges into warangal srsp canal 2 year old dead father and daughter missing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Srsp Canal : వరంగల్ ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు-రెండేళ్ల బాబు మృతి, తండ్రి, కూతురు గల్లంతు

Warangal SRSP Canal : వరంగల్ ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు-రెండేళ్ల బాబు మృతి, తండ్రి, కూతురు గల్లంతు

HT Telugu Desk HT Telugu

Warangal SRSP Canal : వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందగా, తండ్రి, కుమార్తె కారుతో సహా గల్లంతయ్యారు. తల్లి ప్రాణాలతో బయటపడింది.

వరంగల్ ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లిన కారు-రెండేళ్ల బాబు మృతి, తండ్రి, కూతురు గల్లంతు

Warangal SRSP Canal : వరంగల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కారులో స్వగ్రామం వెళ్తుండగా.. కారు అదుపు తప్పి ఎస్సార్ఎస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాబు మృతిచెందగా.. తండ్రి, ఐదేళ్ల పాప కారుతో సహ గల్లంతయ్యారు. కాగా తల్లి తృటిలో తప్పించుకుని ప్రాణాలతో భయటపడింది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్(30) ఎల్ఐసీ హనుమకొండ బ్రాంచ్ లో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కొడుకు ఆర్యవర్థన్(2)తో కలిసి హనుమకొండలోనే నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం ఉదయం 10 గంటల సమయంలో స్వగ్రామమైన మేచరాజుపల్లికి హనుమకొండ నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలోనే కారులో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లి శివారుకు చేరుకున్నారు.

ఛాతిలో నొప్పి రావడంతో వెనక్కి

హనుమకొండ నుంచి బయలు దేరిన ప్రవీణ్ కుటుంబం తీగరాజుపల్లి క్రాస్ దాటి వెళ్లగా.. ప్రవీణ్కు అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి మొదలైంది. దీంతో గుండె నొప్పి వస్తున్నట్టుగా భావించిన ప్రవీణ్ తిరిగి వెనక్కి హనుమకొండకు వెళ్దామని తన భార్య కృష్ణ వేణికి చెప్పాడు. ఈ మేరకు కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి క్రాస్ వద్దకు చేరుకోగా.. ఛాతిలో నొప్పి ఎక్కువైనట్టు తెలుస్తోంది.

అప్పటికే కారు అదుపు తప్పగా.. కారుతో సహ అందరూ పక్కనే ఉన్న ఎస్సార్ ఎస్పీ కెనాల్ లో పడ్డారు. ఛాతి నొప్పితో ప్రవీణ్ అపస్మారక స్థితికి వెళ్లగా.. కారు కెనాల్ లోకి దూసుకెళ్తున్నట్టుగా గమనించిన ఆయన భార్య కృష్ణ వేణి డోర్ తీసుకుని బయటకు దూకే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే కారు నీటిలోకి చేరగా.. కృష్ణ వేణి కారు నుంచి బయటపడి నీళ్లలో మునుగుతోంది.

కారుతో సహా గల్లంతు

ఆమె ఒడిలో రెండేళ్ల బాబు నీళ్లలో కొట్టుకుపోతుండగా.. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు గమనించి వెంటనే కృష్ణ వేణిని బయటకు తీశారు. కానీ అప్పటికే నీళ్లు మింగడంతో రెండేళ్ల బాబు ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలాఉంటే కారు నీళ్లలో మునిగిపోగా.. ప్రవీణ్, ఐదేళ్ల కూతురు చైత్రసాయి కారుతో సహ గల్లంతయ్యారు. ఈ మేరకు స్థానికుల ద్వారా విషయం తెలసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రవీణ్, కూతురు చైత్రసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్పార్ఎస్పీ కెనాల్ లో నీళ్లు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కెనాల్ గేట్లను క్లోజ్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కాగా ప్రవీణ్ ఉదంతంతో మేచరాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం