TSPSC Exams Cancelled: ఇప్పుడు ఏం చేద్దాం..? ప్రి'పరేషాన్'లో ఉద్యోగ అభ్యర్థులు!-candidates are getting confused over exams have been cancelled by tspsc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Candidates Are Getting Confused Over Exams Have Been Cancelled By Tspsc

TSPSC Exams Cancelled: ఇప్పుడు ఏం చేద్దాం..? ప్రి'పరేషాన్'లో ఉద్యోగ అభ్యర్థులు!

HT Telugu Desk HT Telugu
Mar 19, 2023 08:44 AM IST

TSPSC Paper Leak : పేపర్ లీక్ ఎఫెక్ట్ తో పలు పరీక్షలను రద్దు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఈ నిర్ణయం కాస్త… అభ్యర్థులను పరేషాన్ చేస్తోంది. మళ్లీ ప్రిపేర్ కావటమా..? అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల రద్దుతో ఆందోళన
పరీక్షల రద్దుతో ఆందోళన

TSPSC Exams: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశం సంచలనం సృష్టించింది. ఫలితంగా నాలుగు పరీక్షలను రద్దు చేసింది కమిషన్. అయితే ఇందులో అత్యంత కీలమైన గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇప్పటికే వారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయి... మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. మరోవైపు ఏఈ, ఏఈఈ, డీఏవో పరీక్షలు రాసిన వారు... తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేపర్ లీక్ అంశం తెరపైకి రావటంతో.... వీరంతా మళ్లీ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

వెనక్కా... ముందుకా..?

తెలంగాణలో వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. వీరికాకుండే... చాలా ఏళ్లుగా సన్నద్ధమవుతున్న వారు కూడా ఎక్కువే ఉన్నారు. ఇందులో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయా నోటిఫికేషన్లకు అనుగుణంగా నాలుగు పరీక్షలను నిర్వహించింది టీఎస్పీఎస్పీ. ఇందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పూర్తి అవ్వగా.. 25 వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. మరోవైపు మిగతా మూడు పరీక్షల వాళ్లు... తుది ఫలితాలు విడుదలైతే ప్రక్రియ ముగిసిపోతుంది. సీన్ కట్ చేస్తే... ఒక్కసారిగా ఏఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు బయటికి రావటం సంచలనంగా మారింది. సిట్ విచారణలో మిగతా పేపర్లు కూడా లీక్ అయినట్లు గుర్తించటంతో... నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే తుది అంకానికి చేరిన సమయంలో పరీక్షలను రద్దు చేయటంతో.... సీరియస్ గా ప్రిపేర్ అయిన వారికి షాక్ ఇచ్చినట్లు అయింది. ఇనాళ్ల ప్రిపరేషన్ ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల్లో తమ పేరు ఉంటుందన్న ఆశతో ఉన్నవారు... తీవ్రంగా మదనపడుతున్నారు. మళ్లీ ప్రిపరేషానా..? అన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ నిర్వహించే పరీక్షలో ఎలా రాణిస్తామో అన్న భయం కూడా వారిలో మొదలైంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ కి సన్నద్ధమవుతున్న వారు.. చాలా టెన్షన్ అవుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ రాయాల్సి వస్తోందని.. ఒకవేళ ఇందులో క్వాలిఫై కాకపోతే...తమ పరిస్థితేంటన్న ప్రశ్నలు కూడా వారి మెదళ్లను తోలిచివేస్తున్నాయి.

ఇదిలా ఉంటే అర్థిక భారం కూడా ఉద్యోగ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇన్నాళ్లుగా హాస్టళ్లో ఉంటూ ప్రిపేర్ అయ్యామని... ఆ ఖర్చులన్నీ వృథా అయిపోయాయన్న అభిప్రాయాన్ని కూడా పలువురు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న కొందరు... ప్రిపరేషన్ కోసం లాంగ్ లీవ్ లు పెట్టారు. అయితే తీరా గ్రూప్ 1 మెయిన్స్ ప్రక్రియ కూడా మరో మూడు నెలల్లో ముగియనుంది. కానీ ఇప్పుడు పరీక్ష రద్దుతో విషయం కాస్త... మళ్లీ మొదటికివచ్చింది. అయితే సదరు ఉద్యోగాలు... ఇప్పుడే ఏం చేయాలన్న సందిగ్ధంలో ఉన్నారు. లీవ్ పొడిగింపు సాధ్యం కాకపోతే...వదిలేసే పరిస్థితి వస్తోందని చెబుతున్నారు.

గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న శ్రీనివాస్ అనే అభ్యర్థితో హిందూస్థాన్ టైమ్స్ తెలుగు మాట్లాడింది." నేను ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాను. గ్రూప్ 1 దృష్ట్యా కొంత కాలం పాటు సమయం తీసుకున్నాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇప్పుడు ప్రిలిమ్స్ పరీక్ష రద్దుతో ఏం చేయాలో అర్థం కావటం లేదు. పూర్తిగా ఉద్యోగానికి రిజైన్ చేయటమా..? లేక మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టలా అనే విషయంపై ఆలోచించాల్సి వస్తోంది" అని చెప్పారు.

మరోవైపు ప్రభుత్వం... పలు సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. ఉచిత మెటీరియల్, కోచింగ్, భోజనం వంటివి ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే సదుపాయాలు కాదు... తమకు సమయం చాలా ముఖ్యమని, పరీక్షల రద్దుతో అలాంటి టైం వృథా అయిపోందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం