TG Rythu Bharosa : రైతు భరోసాపై కీలక అప్‌డేట్.. వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం!
TG Rythu Bharosa : రైతు భరోసా పథకం అమలు విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన రైతుబంధుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. అలాంటి విమర్శలు రాకుండా రేవంత్ సర్కారు జాగ్రత్తపడుతోంది. తాజాగా రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది.
తెలంగాణలో రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతు భరోసా పథకం అమలు కోసం విధివిధానాలు రూపకల్పన చేసేందుకు.. ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఇప్పటికే ప్రతిపక్షాలు సహా నిపుణులు, రైతుల సలహాలు స్వీకరించింది. తాజాగా సబ్ కమిటీ ఆదివారం మరోసారి భేటీ అయ్యింది. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
మరోసారి భేటీ..
రైతు భరోసా విధివిధానాలపై ఈ సమావేశంలో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై, పాటించాల్సిన నియమనిబంధనలపై చర్చ జరిగింది. ఈ చర్చలో కీలక అంశంపై తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. టాక్స్ పేయర్లను, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసాకు అనర్హులుగా ప్రకటించాలనే అభిప్రాయంపై చర్చ జరిగింది. మరోసారి భేటీ అయ్యాక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
రైతుల కోసం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తుంది. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేశారు. నాలుగు విడతల్లో దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశారు. తాజాగా పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10 వేలు రెండు విడతల్లో ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అదే పథకాన్ని రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ. 15 వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
అభిప్రాయ సేకరణ..
ఈ పథకానికి సంబంధించి, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చర్చ పెట్టారు. ప్రతిపక్షాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. రైతు భరోసాను రైతు బంధు మాదిరిగా భూరికార్డుల ఆధారంగా కాకుండా.. సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
అసైన్డ్ భూముల సంగతి ఏంటీ..
గతంలో రైతుబంధు పట్టా భూములకే వచ్చింది. దీంతో అసైన్డ్ భూములు ఉన్నవారు నష్టపోయారు. కౌలు రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. ములుగు, వరంగల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో చాలావరకు రైతులకు లాభం జరగలేదు. ఇవన్నీ గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాల ప్రజలు రైతు భరోసా కంటే.. వడ్లకు బోనస్ బాగుందని.. ఇంకాస్త బోనస్ పెంచితే.. సాగు చేసే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.