TG Rythu Bharosa : తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుక.. అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు!
TG Rythu Bharosa : తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించింది. జనవరి 14 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. పంట పండించే ప్రతి రైతుకు.. రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. పంట పండించే ప్రతి రైతుకు.. రైతుభరోసా ఇవ్వాలని చర్చ భేటీలో చర్చ జరిగింది. రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులకు అవకాశం ఇచ్చింది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది.
సాగు చేయని భూములు తీసేస్తే..
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించనుంది. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగు చేయని భూములు తీసేస్తే.. కోటి 30 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇచ్చే అవకాశం ఉంది. రైతు భరోసా పథకం అమలుపై సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 3వ తేదీన (శుక్రవారం) కలవనున్నారు. శనివారం కేబినెట్‌లో రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వేగంగా అడుగులు..
తెలంగాణలో రైతు భరోసా అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు, విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయ్యి చర్చించింది. సలహాలు, సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై జనవరి 4న జరగబోయే క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీలైతే అదేరోజు పథకం అమలుపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
అందరికీ కాకుండా..
గతంలో మాదిరిగా కాకుండా.. పంట సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట సాగయ్యాక అధికారులు ధ్రువీకరించి చెల్లించే అవకాశముంది. ఏడాదిలో 8 నెలల నుంచి ఏడాది కాలంపాటు ఒకే పంట సాగు చేసే వారికి రెండుసార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చినా.. దీనిపై మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ హామీ..
ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా ఇవ్వాలా.. వద్దా అనే చర్చ కూడా జరిగింది. ఆదాయపన్ను చెల్లించే వారిని మినహాయిస్తే రూ.350 కోట్ల వరకు భారం తగ్గుతుందని సబ్ కమిటీ అంచనా వేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు ఒక సీజన్‌లో రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చారు. అయితే.. తాము రూ.7,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ప్రభుత్వంపై భారం..
ఇప్పుడే రూ.7500 కాకుండా ఎకరాకు రూ.6 వేలు ఇచ్చి.. దీన్ని క్రమంగా రూ.7500కు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే.. రాష్ట్రంలో మొత్తంగా దాదాపు కోటి 30 లక్షల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.6 చొప్పున చెల్లించినా.. సుమారు రూ.6 వేల కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. క్యాబినెట్ భేటీ తర్వాతనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.