Telangana Cabinet : కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.. అసెంబ్లీ వాయిదా!
Telangana Cabinet : అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కులగణన రిపోర్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపనుంది. కేబినెట్ భేటీ తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల అసెంబ్లీ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.
తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీ కొనసాగుతుండటంతో అసెంబ్లీ వాయిదా వేయాలని.. మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మినిట్స్ ఖరారు చేయడాని, నోట్ తయారీకి సమయం కావాల్సి ఉండటంతో.. సభను వాయిదా వేయాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో సభాపతి మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేశారు. కేబినెట్ భేటీ ముగిసేసరికి మరికొంత సమయం పట్టనుంది.

కులగణన సర్వేపై చర్చ..
వాస్తవానికి శాసనసభ, శాసనమండలి ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాలి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ భేటీ ముగిశాక.. అసెంబ్లీ ప్రారంభం కావాలి. దీన్ని మధ్యాహ్నంకు వాయిదా వేశారు. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేను అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావించింది. కులగణన రిపోర్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపనుంది.
ఎస్సీ వర్గీకరణపై..
ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఏకసభ్య కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు అయ్యింది. ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏకసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం కులగణన రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని.. బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
బీఆర్ఎస్ విమర్శలు..
రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తిస్థాయిలో జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తుందని.. విమర్శలు చేస్తున్నారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి..
రేవంత్ రెడ్డి కేంద్రంపై నెపం నెట్టి.. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును దేశంలో అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.