Fine Imposed : ఇది మరీ చిత్రం.. ఎద్దులు మూత్ర విసర్జన చేశాయని ఫైన్-bullock cart owner fined for oxen peeing in khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Bullock Cart Owner Fined For Oxen Peeing In Khammam

Fine Imposed : ఇది మరీ చిత్రం.. ఎద్దులు మూత్ర విసర్జన చేశాయని ఫైన్

HT Telugu Desk HT Telugu
Dec 06, 2022 02:08 PM IST

Khammam News : బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, మల విసర్జన చేసే వ్యక్తులపై జరిమానా విధించడంలో అధికారులు విఫలమవుతున్నారనే చర్చ ఉంది. అయితే జంతువులు మూత్ర విసర్జన చేయడంతో మాత్రం ఫైన్ వేశారు అధికారులు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రోడ్డు మీద వెళ్తుంటే.. అప్పుడప్పుడు కొంతమంది రోడ్డు పక్కన మూత్ర విసర్జన కోసం వెళ్తుంటారు. కానీ వారి మీద ఫైన్ పడుతుందా.. లేదా.. అనేది అందరికీ తెలిసిందే. ఇది పెద్దగా అమలు కావడం లేదనేది బహిరంగ రహస్యం. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, మల విసర్జన చేయడం నేరం. దీనికి జరిమానా విధిస్తారు. కానీ ఖమ్మం(Khammam) జిల్లాలో విచిత్రం జరిగింది. ఎద్దులు మూత్ర విసర్జన చేశాయని, ఫైన్(Fine) వేశారు అధికారులు. వాటి యజమాని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది.

ట్రెండింగ్ వార్తలు

వివరాల్లోకి వెళ్తే.. సింగరేణి(Singareni) కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నుంచి ఓ ఎద్దుల బండి వెళ్తొంది. ఆ బండి మీద సుందర్ లాల్ అనే వ్యక్తి పూల కుండీలు, మట్టిని మరో చోటికి తీసుకెళ్తుంటాడు. ఇదే ఆయనకు జీవనాధారం. ఖమ్మం(Khammam)లోని కొత్తపూసపల్లి-పాతపూసపల్లి మధ్య రోడ్డు పక్కనున్న సింగరేణి కార్యాలయం ఎదుటకు రాగానే ఎద్దులు మూత్ర విసర్జన చేశాయి. ఇక్కడే సమస్య మెుదలైంది. ఎద్దుల తమ ఆఫీస్ ముందు మూత్ర విసర్జన చేయడం ఏంటని.. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫిర్యాదు చేసింది. ఇబ్బందికరంగా ఉందని పేర్కొంది.

ఈ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు(Police).. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 290(పబ్లిక్ న్యూసెన్స్) కింద సుందర్ లాల్ మీద కేసు నమోదు చేశారు. ఆయనను ఎల్లందులోని ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరించారు. సుందర్ లాల్ పై రూ.100 జరిమానా వేశారు. నవంబర్ 29న నోటీసు అందింది. ఫైన్ కట్టేందుకు కూడా సుందర్ లాల్ దగ్గర డబ్బులు లేవు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్(Constable) దగ్గర వంద రూపాయలు అప్పు చేశాడు. మళ్లీ ఇస్తానని చెప్పి.. జరిమానా కట్టేశాడు.

జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఆగినప్పుడు తన ఎద్దులు మూత్రవిసర్జన చేస్తాయని ఊహించలేదని సుందర్ లాల్ అన్నాడు. తనకు ఎద్దుల బండి ఒక్కటే జీవనాధారం అని చెప్పాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న తన భూమికి తగిన పరిహారం అందకపోవడంతో ఎద్దుల బండిపై ఆధారపడి బతుకుతున్నాడు. అసలు ఎద్దులు మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాయో.. ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. నోరు లేని జీవాలు చేసిన పనికి ఫైన్ వేశారన్నాడు.

అయితే ఈ ఘటనపై ఇప్పుడు చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. సుందర్ లాల్ లాంటి వ్యక్తులు చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. మనుషులు బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తే.. పట్టించుకోవడం లేదని.. ఎద్దులు చేస్తే ఫైన్(Fine) విధిస్తారా అని అడుగుతున్నారు.

ఎద్దులు మూత్ర విసర్జన చేశాయని ఫైన్
ఎద్దులు మూత్ర విసర్జన చేశాయని ఫైన్
WhatsApp channel