Balapur Murder Case: బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హత్యకు కారణం ఇదే!-btech student prashant killed in balapur due to love affair ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Balapur Murder Case: బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హత్యకు కారణం ఇదే!

Balapur Murder Case: బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ మర్డర్ కేసులో ట్విస్ట్.. హత్యకు కారణం ఇదే!

Basani Shiva Kumar HT Telugu
Aug 23, 2024 10:55 AM IST

Balapur Murder Case: హైదరాబాద్ నగరంలోని బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి హత్య ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ప్రశాంత్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది.

బీటెక్ విద్యార్థి ప్రశాంత్ (X)
బీటెక్ విద్యార్థి ప్రశాంత్ (X)

యువతి ప్రేమ విషయంలోనే ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్‌ (21)ను స్నేహితులు హత్య చేసినట్టు తెలుస్తోంది. బాలాపూర్‌లో మండి 37 హోటల్ సమీపంలో ప్రశాంత్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య జరిగిన ప్రాంతాన్ని మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి పరిశీలించారు. హత్య చేసి పరారైన నిందితులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో ప్రశాంత్ తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది.

హత్యకు గురైన ప్రశాంత్‌ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం పరీక్ష జరిగింది. పరీక్ష తర్వాత ప్రశాంత్‌ సహా నలుగురు వ్యక్తులు పాన్‌షాపు వద్దకు వచ్చి సిగెరెట్‌ తీసుకున్నారు. ఇదే సమయంలో నలుగురి మధ్య వివాదం జరిగింది. ప్రశాంత్ స్నేహితుల్లో ఒకరు ప్రశాంత్​పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దాడి జరిగిన ప్రదేశాన్ని మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ మర్డర్ కేసుపై స్పెషల్ టీ ఏర్పాటు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రశాంత్‌ది ఖమ్మం. 20 ఏళ్ల కిందట ప్రశాంత్ కుటుంబం బాలాపూర్ వచ్చి స్థిరపడింది. ఒక్కగానొక్క కుమారుడిని బాగా చదివించాలని అతని తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. కానీ.. వారికి విషాదమే మిగిలింది. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా హత్యకు గురవడంతో.. ప్రశాంత్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన కుమారుడిని అతని స్నేహితులు ఇంటికి వచ్చి తీసుకెళ్లి.. ఇలా హత్య చేశారని రోధిస్తోంది.