Warangal : పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే దారుణ హత్య.. పోలీసులకు కొత్త సవాల్!
Warangal : మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మళ్లీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లాలో ఇద్దరిని అతి దారుణంగా నరికి చంపారు. అతి కూడా పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో.. ఇద్దరిని అతి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే.. ఈ దారుణ హత్య పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసిరారు అనే చర్చ జరుగుతోంది.
రోజురోజుకూ పట్టును కోల్పోతున్న మావోయిస్టులు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనే టాక్ విపిస్తోంది. పోలీసులు, భద్రతా బలగాల కళ్లుగప్పి చాపకింద నీరులా కదలికలను సాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీకి చెందిన కీలక దళసభ్యులు.. గత నెలలో వాజేడు మండలంలోని ఓ గ్రామ సమీప అడవుల్లో సమావేశం నిర్వహించారు. ఈ రెండు మండలాల్లోని పలు అటవీ గ్రామాల్లో గుట్టుగానే సంచరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.
తాజాగా వాజేడు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. వాజేడు మండల కేంద్రంతో అనుబంధంగా ఉన్న జంగాలపల్లికి దగ్గర్లోని పెనుగోలుకాలనీలో ఈ హత్యలు చేయడం పోలీసులకు సవాల్ విసిరినట్లయింది. పోలీస్ స్టేషన్‌కు ఇంత దగ్గరగా వచ్చి మావోయిస్టు దళం ఇద్దరిని నిమిషాల వ్యవధిలోనే హత్య చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిఘా పెంచారు.
ఇటీవల భారీ ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లతో మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఉంటూ అప్పుడప్పుడు ప్రకటనలు, లేఖలతో ఉనికిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ దుశ్చర్యకు పాల్పడటంతో నిఘా వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి.
వీరికి భయం..
రెండేళ్ల కిందట వెంకటాపురం మండలం కొండాపురం సమీప బస్తర్‌గుంపులో ఇన్‌ఫార్మర్ నెపంతో సపక గోపాల్(45) అనే వ్యక్తిని మావోయిస్టులు హతమార్చారు. ఆ ఘటన నవంబర్ 10న జరిగింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ వాజేడు మండలం పెనుగోలుకాలనీకి చెందిన రమేశ్, అర్జున్‌లను చంపారు. దీంతో మావోయిస్టు హిట్‌లిస్టులో ఉన్న వారికి భయం పట్టుకుంది.
వాజేడులో హత్యలు జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. సమీపంలోని గ్రామాలను, అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులు ఇంత డేర్‌గా రావడానికి ఎవరు సహకరించారనే కోణంలో పోలీసులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. వాజేడు పరిసర ప్రాంతాల్లోనే మావోయిస్టులు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.