Vemulawada Murder: వేములవాడలో దారుణ హత్య... మారణాయుధంతో హంతకుడు హల్ చల్.. భయాందోళనకు గురైన జనం
Vemulawada Murder: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. మిత్రుడే గొడ్డలితో నరికి చంపాడు. హత్య తర్వాత చిందిన రక్తం మరకలతో కూడిన గొడ్డలిని ప్రదర్శిస్తు హంతకుడు హల్ చల్ చేశాడు.
Vemulawada Murder: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని డ్రైవర్ గా పని చేసే నాగయ్యపల్లి గ్రామానికి చెందిన చెట్టిపల్లి పర్శరాం (39) దారుణ హత్యకు గురయ్యారు. తెలిసిన వ్యక్తే గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. హత్యకు పాత కక్షలే కారణమని భావిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లతా వేములవాడకు చెందిన మృతుడు పర్శరాం వేములవాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ వద్ద గత కొంతకాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో కొనాయిపల్లికి చెందిన బైరెడ్డి ఇంటికొచ్చి నమ్మించి బయటకు తీసుకెళ్లి మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడని మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. బైరెడ్డి గతంలో నాన్నకు స్నేహితుడేనని మృతుని కుమారుడు తెలిపారు. ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పి నమ్మించి హత్య చేశాడని చెప్పారు.
హంతకుడి వీడియో కలకలం…
పర్శరాం హత్యకు గురయ్యాక బైరెడ్డి అనే వ్యక్తి రక్తం తో కూడిన గొడ్డలిని చూపిస్తు వీడియో విడుదల చేయడం కలకలం సృష్టించింది. చూసిర్రా...రక్తం మరకలు అంటూ గొడ్డలి చూపారు. బైరెడ్డి అంటే ఎంటో ఒక్కొక్కడికి చూపిస్తానని వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బైరెడ్డి హల్ చల్ చేస్తు వీడియో విడుదల చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
హంతకుడి కోసం గాలిస్తున్న పోలీసులు...
అత్యంత దారుణ హత్యకు డ్రైవర్ గురికావడం, హంతకుడు గొడ్డలి ప్రదర్శిస్తు వీడియో విడుదల చేయడం పట్ల పోలీసులు సీరియస్ గా స్పందించారు. సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని వేములవాడ ఆసుపత్రికి తరలించి హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్య కేసు నమోదు చేసి హంతకుడిని త్వరలోనే పట్టుకుని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పోలీసులు ప్రకటించారు. బైరెడ్డి పై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం