Formula E Car Race Case : ఈడీ విచారణకు కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ!
Formula E Car Race Case : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతోందనే చర్చ జరుగుతోంది.
మాజీమంత్రి కేటీఆర్ ఇవాళ (గురువారం) ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు. వాస్తవానికి ఈ నెల 7న కేటీఆర్ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ.. తాను రాలేనని చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

కేటీఆర్‌పై అభియోగాలు..
ఫార్ములా ఈ కార్ రేస్‌లో నిబంధనలు ఉల్లంఘించారని కేటీఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. దీనిపై తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. అయితే ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లించారని ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇదే కేసులో నిందితులుగా అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను ఈడీ ప్రశ్నించింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్..
ఈ కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను కూడా 'డిస్మిస్డ్ యాజ్ విత్‌డ్రాన్'గా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈడీ విచారణ వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోసారి నోటీసులు..
ఇదే కేసులో భాగంగా.. ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు మరోమారు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు ఈనెల 9న కేటీఆర్‌ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ ఈడీ విచారణ అనంతరం మరోసారి ఏసీబీ అధికారులు ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డిస్మిస్ కాలేదు..
కేటీఆర్ సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని.. ఆయన తరపు న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. లీగల్ ఒపీనియన్ ప్రకారం.. కేసును విత్ డ్రా చేసుకున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా ఆప్పిల్ చేసుకునేందుకు తమకు అవకాశం ఉందని వివరించారు.
'ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం' అని మోహిత్ రావు వివరించారు.