KTR Thanks to CBN : ధన్యవాదాలు చంద్రబాబు గారూ.. మీ పాత శిష్యుడికి అవగాహన కల్పించండి : కేటీఆర్
KTR Thanks to CBN : బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పురోగతిని గుర్తించినందుకు.. ఏపీ సీఎం చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఆయనకు అవగాహన కల్పించాలని కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతిని సాధించిందని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
మీ పాత శిష్యుడికి..
'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్ల.. తెలంగాణ భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారిందని అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారు. ధన్యవాదాలు చంద్రబాబు గారూ. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడికి దయచేసి అవగాహన కల్పించండి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు మాట్లాడిన వీడియోను జత చేశారు.
పరోక్షంగా టార్గెట్..
దావోస్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరం శిఖరాగ్ర సమావేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత.. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు, రాష్ట్ర పురోగతికి బలమైన ప్రభుత్వ విధానాల అవసరాన్ని నొక్కి చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. భారతదేశం నుండి కంపెనీలను దావోస్‌కు తీసుకెళ్లి.. అక్కడ వారితో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈసారి రేవంత్ రెడ్డి చేసిన పనిని ఆయన పరోక్షంగా ఎగతాళి చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ విమర్శలు..
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల తరహాలోనే.. దావోస్ పెట్టుబడుల పేరిట అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతేడాది దావోస్ నుంచి వచ్చిన రూ. 40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటివరకు ఏదీ వాస్తవరూపం దాల్చలేదన్నారు. ఒకవేళ ఆ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే.. తామే సీఎం రేవంత్‌కు సన్మానం చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ కౌంటర్..
తెలంగాణకు పెట్టుబడుల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. రాష్ట్రానికి 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని... ఇది చూసి బీఆర్ఎస్ నాయకులకు కడుపు మంట వస్తుందని విమర్శిస్తూ.. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కేసీఆర్, కేటీఆర్ కడుపు పట్టుకుని ఉన్న ఫ్లైక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈనో ప్యాకెట్ల రాజకీయం..
తెలంగాణ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని.. కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఉన్నప్పటి నుంచే ఈ ప్రచారాన్ని అధికార కాంగ్రెస్ మెుదలుపెట్టింది. ఈక్రమంలోనే ఈనో ప్యాకెట్లను కేసీఆర్, కేటీఆర్‌కు పంపుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు.