KTR On Budget : ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ - కేటీఆర్-brs working president ktr slams congress government over budget priorities and promises ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Budget : ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ - కేటీఆర్

KTR On Budget : ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ - కేటీఆర్

KTR On Telangana Budget 2025 : రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని కేటీఆర్ విమర్శించారు. బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడుతూ.. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ ప్రమాదకరమంటూ ఫైర్ అయ్యారు. ఈ బడ్జెట్… ప్రజల కష్టాలు తీర్చేది కాదని.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని ఆరోపించారు.

ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ -కేటీఆర్

2025-2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన… ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని ఆరోపించారు. ఈ బడ్జెట్ తో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్నా అని… ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

40 శాతం కమీషన్ల బడ్జెట్ - కేటీఆర్

“6 గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలకు మంగళం పాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది. ఇది 40 శాతం కమీషన్ల కాంగ్రెస్ బడ్జెట్. ఇచ్చిన మాటకు కాకుండా ఢిల్లీకి మూటలు పంపడంపైననే దృష్టి. ప్రజల కష్టాలుపైన ధ్యాసలేని బడ్జెట్. ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టే కుట్ర చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని అన్నదాత దాకా అందరికీ మోసమే” అని కేటీఆర్ విమర్శించారు.

“ఇది ట్రిలియన్ డాలర్ల అప్పు దిశగా ఉన్న బడ్జెట్. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతాడు. ప్రభుత్వ అందమే సక్కగా లేదు.. అందాల పోటీలు పెట్టేందుకు సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. రంకెలు కాదు రేవంత్ రెడ్డి.. అంకెలు ఎక్కడ పోయాయి..? ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలన చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్‌ది. ఈ బడ్జెట్‌లో 6 గ్యారంటీలకు పాతర వేశారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీలపైన బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఈ ప్రభుత్వానికి ఇచ్చిన 40 శాతం సమయం ఈ బడ్జెట్‌తో సమసిపోయింది. తులం బంగారం దిక్కులేదు. చేనేతకు మా హయాంలో రూ. 1200 కోట్లు.కేటాయిస్తే.. ఇవ్వాళ చేనేత కార్మికులకు రూ. 300 కోట్లు కేటాయిస్తూ పరిమితం చేశారు” అని కేటీఆర్ దుయ్యబట్టారు.

బడ్జెట్ లో ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదని కేటీఆర్ గుర్తు చేశారు. “యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. వైన్స్ షాపులో 25 శాతం రిజర్వేషన్ గౌడన్నలకు ఇస్తామనీ హామీ ఇచ్చారు.. అది ప్రస్తావన లేదు. దళిత సోదరులను మోసం చేశారు. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, కాగితాలు ఇచ్చింది ఈ సన్నాసి ప్రభుత్వం. నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా గురించి ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లల చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహానగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేకమేడలా కుప్పకూల్చారు” అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం