KTR : ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడుతామా? : కేటీఆర్
KTR : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చావుకైదా తెగించాం.. ఏ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని సవాల్ విసిరారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, తుస్సు బాంబులకు భయపడతామా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బావమరిది, పొంగులేటి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ బాగోతం బయట పెడతామని స్పష్టం చేశారు.
సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ నిర్వహించారు. దీనికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ తీరుపై మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. మోదీ నాయకత్వంలో పని చేస్తున్నారని విమర్శించారు.
త్వరలో కీలక నేతలు అరెస్ట్ అవుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బాంబు పేలుతుందని బీజేపీ నేతలు చెప్పడాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ.. పొంగులేటిపై ఈడి రైడ్‌లో ఏమైనా దొరికిందో చెబుతారు కావొచ్చని ఎద్దేవా చేశారు. లేదంటే అమృత్ స్కీమ్ నిధుల దుర్వినియోగంపై సీఎంపై కేసు నమోదు అవుతుందెమోనని వ్యంగాస్త్రాలు సంధించారు.
అందరి లెక్కలు తేలుస్తాం..
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు.. రాఘవ కన్‌స్ట్రక్షన్, మెగా ఇంజనీరింగ్ రూ.4500 కోట్లు పంచుకుతిన్నారని కేటిఆర్ ఆరోపించారు. అవన్నీ బయట పెడతామని.. ఏ కేసు పెడతారో పెట్టుకొమ్మని సవాల్ విసిరారు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు.. ఈ తుస్సు బాంబులకు భయపడతామా అని ప్రశ్నించారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపుతామంటే పంపండి.. ఇంతకు వంద రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
ఆ ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారులు..
బీఆర్ఎస్‌లో గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన పదిమంది ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారులని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారని గుర్తు చేశారు. ఈరోజు ఎవరిని కొట్టాలని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి అంటుంటే.. జరగలేదని శ్రీధర్ బాబు బుకాయిస్తుండని విమర్శలు గుప్పించారు.
ప్రజా ఉద్యమం తప్పదు..
విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఐదు రోజులుగా ఈఆర్సీని కలిశామని కేటిఆర్ వివరించారు. ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. పేద ప్రజల నడ్డి విరిచేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ప్రజలపై రూ.18 వేల కోట్ల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రూపాయి కూడా ప్రజలపై భారం వేయలేదని కేటీఆర్ వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగు, తాగు నీరు ఫ్రీగా ఇచ్చామని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టినా ఒక్క రూపాయి ఛార్జీ పెంచలేదన్నారు. సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు 10 హెచ్‌పీ వరకు 50 శాతం సబ్సిడీ ఇచ్చామని వివరించారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)