KTR Comments : గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడతాడంట.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు
KTR Comments : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ గాడ్సే శిష్యుడని సెటైర్లు వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తోందని విమర్శించారు. పొంగులేటి బాంబులు ఎప్పుడు పేలతాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఖతం చేస్తా అన్నోళ్లే ఖతం అయ్యారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడని.. గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడుతాడంట అని సెటైర్లు వేశారు. గాంధీ మనవడు విగ్రహం వద్దు, ఆ డబ్బుతో పేదలకు మంచి చేయండి అంటే.. ఈ గాడ్సే శిష్యుడు విగ్రహం పెడుతాడంట అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి తెలంగాణ భవన్‌లో కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు గుప్పించారు.
'ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెప్తున్నారు. ఖర్గేను నేను తెలంగాణ రమ్మని చెప్తున్నా.. ఇక్కడ మా మేకలు మీ మందలో తప్పిపోయాయి చూడాలని కోరుతున్నా. ప్రకాష్ గౌడ్, గాంధీలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ముందా?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'తెలంగాణలో కాంగ్రెస్‌కు బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తుంది. మేము రేవంత్ రెడ్డిని తిడితే.. బండి సంజయ్, రఘనందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్వింద్‌లు తట్టుకోలేకపోతున్నారు. వాళ్లకు రోషం వస్తోంది. అసలు ఆ ఎంపీలు బీజేపీలో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా? రేవంత్ కూడా బీజేపీలో ఉన్నాడా? కాంగ్రెస్‌లో ఉన్నాడా? అర్థమైతలేదు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'దీపావళి అయిపొయింది. కార్తీక పౌర్ణమి కూడా అయిపొయింది. కానీ పొంగులేటి బాంబులు మాత్రం ఇంకా పేలుతలేవు' అని కేటీఆర్ పంచ్‌లు పేల్చారు. 'కేసీఆర్ నాయకత్వంలో అభివృద్దే మన కులంగా, సంక్షేమమే మన మతంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని పదేళ్ల పాటు చూసుకున్నాం. కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఒక దిక్సూచిగా, ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలిచింది. కేసీఆర్‌ను ఖతం చేస్తా అన్నోళ్లు ఎంతో మంది కనుమరుగైపోయిండ్రు' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఫిర్యాదు..
లగచర్ల ఘటన బాధిత కుటుంబ సభ్యులతో కలిసి.. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మాజీమంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లగచర్ల బాధితులతో వెళ్లారు.