తెలంగాణలో అధికార మార్పిడి తర్వాత రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా… పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలో ఉంది. దాదాపు 15 నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పార్టీ… అంశాలవారీగా పోరాటం చేస్తూ వస్తోంది. ఆరు నెలల వరకు వేచి చూసిన ఆ పార్టీ నాయకత్వం… ఆ తర్వాత స్పీడ్ పెంచేసింది. హైడ్రా బాధితుల మొదలుకొని… లగచర్ల వరకు బాధితులకు అండగా ఉంటూనే… క్షేత్రస్థాయిలో దూకుడు పెంచే పనిలో పడింది.
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామన్న సందేశాన్ని పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది. ఇక ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత కీలక నేతలుగా ఉన్న హరీశ్ రావ్, కేటీఆర్ ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఒకరు కాకపోతే మరోకరు అన్నట్లు… సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే తంతును కొనసాగిస్తున్నారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్… ప్రస్తుతం ప్రతిపక్ష స్థానంలో ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి… పవర్ లోకి రావాలని చూస్తోంది. ఇందుకోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఈసారి జరిగే రజత్సోవ(పార్టీ ఆవిర్భావ) వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించింది. వరంగల్ వేదికగా లక్షలాది మందితో సభను నిర్వహించి…. కేడర్ లో సరికొత్త జోష్ ను తీసుకురావాలని భావిస్తోంది.
పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…. గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పని చేయబోతున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానని కీలక ప్రకటన చేశారు.
తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలకు మంచి గుర్తింపు ఉంది. నాటి వైఎస్ఆర్ నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు ఈ లిస్ట్ లో ఉన్నారు. అంతేకాదు… పాదయాత్ర ద్వారా పార్టీని నిలబెట్టుకోవటమే కాదు… కుర్చీని కూడా కైవసం చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి పాదయాత్ర చేయగా… ఏపీలో నారా లోకేశ్ సుదీర్ఘమైన పాదయాత్రను చేపట్టారు. అటు టీడీపీ అధికారంలోకి వస్తే… తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే తాజాగా కేటీఆర్ చేసిన పాదయాత్ర ప్రకటన కూడా ఆసక్తికరంగా మారింది.
వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందని క్లియర్ కట్ గా చెప్పేశారు. వచ్చే ఏడాది నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోతుంది. ఇప్పటికే అంశాలవారీగా పోరాడుతున్న బీఆర్ఎస్…. వచ్చే ఏడాది నాటికి గేర్ మార్చే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే… కేటీఆర్ పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ పాలనలో చేసిన పనులతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లాలని గులాబీ పార్టీ నాయకత్వం చూస్తోంది. తద్వారా పార్టీకి మైలేజ్ రావటంతో పాటు ఎన్నికల ఏడాది నాటికి గ్రౌండ్ లో పూర్తిస్థాయిలో బలపడాలని వ్యూహాలు పన్నుతోంది. వీటన్నింటిని క్రోడీకరించుకునే…. కేటీఆర్ రంగంలోకి దింపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్న అభిప్రాాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్… అన్నీతానై నడిపిస్తున్నారు. నేరుగా కేసీఆర్ గ్రౌండ్ లోకి దిగనప్పటికీ… ఆయన సూచనల మేరకు నేతలంతా నడుచుకుంటున్నారు. అయితే కేటీఆర్ పాదయాత్ర ద్వారా….ప్రజల్లో బీఆర్ఎస్ పై మరింత సానుభూతి పెరుగుతుందన్న విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సునాయసంగా విజయం సాధించి… మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఐటీ మంత్రిగా పేరు సంపాదించుకున్న కేటీఆర్… పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆయన స్ట్రెచర్ మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు, విశ్లేషణలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి…!