బీఆర్ఎస్‌లో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చన్న కేటీఆర్.. అంతర్గత విషయాలు బయట మాట్లాడకపోతే మంచిదని హితవు పలికారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే అని స్పష్టం చేశారు. తమ పార్టీలో రేవంత్ కోవర్టులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.
'పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చు. అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల కేసీఆర్‌కు కవిత లేఖ రాశారు. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆరు పేజీల లేఖ రాశారు. దీంట్లో పలు అంశాలపై కీలక కామెంట్స్ చేశారు. 'మై డియర్ డాడీ' అంటూ రాసిన లేఖలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వివరించారు.
'బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు. ఆపరేషన్ కగార్ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది. మీరు చెప్పిన కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అన్న మాట బాగా పాపులర్ అయింది. పహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయి. రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారు. అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు. పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి' అని కవిత పాజిటివ్ అంశాలను ప్రస్తావించారు.
'ఉర్దూలో మాట్లాడలేదు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు. పాత ఇన్‌ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా.. కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్‌ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది. కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడంతో మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి. 2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది. ‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది. బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్‌ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది' అంటూ నెగిటివ్ అంశాలను కవిత ప్రస్తావించారు.
సంబంధిత కథనం