Lagacharla Incident : మీరు భయపడాల్సిన అవసరం లేదు.. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు : కేటీఆర్
Lagacharla Incident : తెలంగాణలో లగచర్ల లడాయి కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. చర్లపల్లి జైలుకు వెళ్లారు. అక్కడ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. పేద, గిరిజన, బలహీనవర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి.. నరేందర్ రెడ్డి జైలు పాలయ్యాడని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'పట్నం నరేందర్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా.. 30 మంది అమాయక రైతులను విడిపించండని చెప్పారు. అందుకు ఆయనకు అభినందనలు. కొడంగల్‌లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని.. అక్కరలేని ఫార్మా విలేజ్‌ను రుద్దుతున్నారు. వారికోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారు. సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారు. కొడంగల్‌లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచకాలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు. కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు' అని కేటీఆర్ ఆరోపించారు.
'నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా? సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా? సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు. నువ్వు నియంత కాదు. నువ్వు చక్రవర్తి కాదు. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావ్' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు. సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది' అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
'నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు. మా నేత నరేందర్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నాడు. పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరాడు. మహబూబాబాద్‌లో మేము చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారు. నరేందర్ రెడ్డికి, చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం.. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉంది' అని కేటీఆర్ స్పష్టం చేశారు.