Telangana Assembly : సింపుల్ లివింగ్- హై థింకింగ్‌కు పర్యాయపదం మన్మోహన్ సింగ్ : కేటీఆర్
Telangana Assembly : మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి.. పూర్తి మద్దతు ఇస్తున్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. సింపుల్ లివింగ్- హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం అని కొనియాడారు. లాయల్టీకి మారుపేరు మన్మోహన్ సింగ్ అని అభివర్ణించారు.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. మన్మోహన్ సింగ్‌ను ప్రభుత్వంలోకి నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారని కేటీఆర్ వివరించారు. పీవీ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారని గుర్తుచేశారు. తన తొలి బడ్జెట్ ప్రసంగంలోనే భారత దేశ స్థితిగతులను తెలిపిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ కొనియాడారు.
లాయల్టీకి మారుపేరు..
'మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేసిన సేవలలో అనేక సంస్కరణలను సాధించింది భారతదేశం. సింపుల్ లివింగ్- హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం. లాయల్టీ అనేది ఈరోజున్న రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. కానీ తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌తో అనుబంధం..
'మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మన్మోహన్ సింగ్‌తో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాఖల కేటాయింపుల్లో చిక్కుముడి వచ్చింది. కేసీఆర్ తన షిప్పింగ్ పోర్ట్‌ఫోలియోను డిఏంకే పార్టీకి ఇచ్చారు. స్వయంగా మన్మోహన్ దగ్గరికి వెళ్లి తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఎర్పాటు ముఖ్యమంటూ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఇచ్చిన శాఖల్ని వదులుకున్నారని.. ఇదే మిమ్మల్ని ఒక ఖర్మయోగిగా మారుస్తుందని ఆరోజు మన్మోహన్ సింగ్ కేసీఆర్ గురించి అన్నారు' అని కేటీఆర్ గుర్తుచేశారు.
2004లో..
'సమయం వచ్చినప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఒక అంశాన్ని కానీ, ఒక వ్యక్తిని గాని ఆపలేదు. ఇదే మన్మోహన్ సింగ్ నాయకత్వం సూచిస్తుంది. ఇదే అంశం కూడా తెలంగాణకు వర్తిస్తుంది. తెలంగాణ కల సాకరమయ్యే రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. డిసెంబర్ 18, 2004వ సంవత్సరంలో తెలంగాణ నుంచి ఒక ముఖ్యమైన డెలిగేషన్ తీసుకొస్తున్నామని తెలియజేశాం. మీరు కేవలం ఐదు నిమిషాలు కాదు మరింత సమయం ఇవ్వాలని కేసీఆర్ ప్రధానమంత్రిని కొరితే.. మన్మోహన్ సింగ్ అంగీకరించారు' అని కేటీఆర్ వివరించారు.
ఓబీసీల సమస్యలపై..
'ఓబీసీల సమస్యల పైన కేసీఆర్, ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం ప్రతినిధి బృందానికి 45 నిమిషాల సమయం ఇచ్చి.. దాదాపు గంటన్నర పాటు అన్ని అంశాలను తెలుసుకున్నారు. సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారు. తాను మౌనంగా ఉండి, ఎన్ని నిందలు వేసినా.. సంస్కరణలను అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు.. పార్టీ ప్రతినిధి బృందం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించాం' అని కేటీఆర్ చెప్పారు.
పీవీని గుర్తుచేసుకోవాలి..
'మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గురించి కూడా గుర్తు చేసుకోవాలి. మన్మోహన్ సింగ్‌కు దక్కిన గౌరవప్రదమైన వీడ్కోలు మన పివికి దక్కలేదన్న బాధ కొంత కలిగింది. మన్మోహన్ సింగ్ విగ్రహం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు పూర్తి సహకారం అందిస్తాం. అలాగే పీవీకి ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తీర్మానాన్ని బలపరుస్తున్నాం..
'ప్రధానులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి దేశ రాజధాని ఢిల్లీలో మెమోరియల్ ఉంది. కానీ పీవీకి లేదు కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేరకు మెమోరియల్ ఎర్పాటు కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నాము. సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాం' అని కేటీఆర్ స్పష్టం చేశారు.