BRS vs Congress : అన్నపూర్ణ తెలంగాణను.. ఆత్మహత్యల తెలంగాణ చేశారు : కేటీఆర్
BRS vs Congress : కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. అన్నపూర్ణ తెలంగాణను.. ఆత్మహత్యల తెలంగాణ చేశారని విమర్శించారు. గతంలో కేసీఆర్ రైతులకు భరోసా ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బజారునపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఓ వర్గం సంతోషంగా లేదని ఆరోపించారు.
ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను.. పదేళ్ల పాలనతో కేసీఆర్ దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని.. బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో అన్నపూర్ణ తెలంగాణను.. ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌ను కుదేలు చేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్.

అన్నదాతల ఆత్మహత్యలు..
'ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టిన పెట్టుబడులు రాక, మిత్తి కూడా ఎల్లక ఉసురు తీసుకుంటున్నారు. పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చి కేసీఆర్ రైతులలో ఆత్మవిశ్వాసం నింపారు. వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచారు. ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు లేక, కరంటు రాక, పంటలు కొనుగోలు చేయక, రైతు భరోసా లేక, రుణమాఫీ గాక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు' అని కేటీఆర్ విమర్శించారు.
రైతన్నల నిరసనలు..
'ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో. పాలమూరులో పల్లికి మద్దతు ధరకోసం, వైరాలో మిర్చికి మద్దతు ధర కోసం, బయ్యారంలో కరెంటు కోసం, జగిత్యాలలో యూరియా కోసం.. భూమిని నమ్ముకుని ప్రపంచానికి బువ్వను అందించే రైతన్నలు.. నేడు పిడికిలెత్తి నిరసనలు చేస్తున్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేసిన రైతన్నలు.. నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులుతో కాలం వెల్లదీస్తున్నారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎట్లాయె తెలంగాణ..
'దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో రైతన్నలు దగాపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నింపుకున్న వెలుగులు.. ఏడాది కాంగ్రెస్ పాలనలో మటుమాయం అవుతున్నాయి. రైతుబంధు కోసం ఎదురుచూపులు, రైతుబీమా కోసం ఎదురు చూపులు, రుణమాఫీ కోసం ఎదురు చూపులు, కరంటు కోసం ఎదురుచూపులు, యూరియా కోసం ఎదురుచూపులు, సాగునీటి కోసం ఎదురుచూపులు, పంటల కొనుగోలు కోసం ఎదురు చూపులు.. ఏడాది కాంగ్రెస్ పాలన.. ఎదురుచూపుల పాలన. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ' అని ఆవేదన వ్యక్తం చేశారు.