'ఈ నెల 8న రండి… చర్చకు నేను రెడీ' - సీఎం రేవంత్ ఛాలెంజ్ పై కేటీఆర్ రియాక్షన్-brs working president ktr challenge to cm revanth reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'ఈ నెల 8న రండి… చర్చకు నేను రెడీ' - సీఎం రేవంత్ ఛాలెంజ్ పై కేటీఆర్ రియాక్షన్

'ఈ నెల 8న రండి… చర్చకు నేను రెడీ' - సీఎం రేవంత్ ఛాలెంజ్ పై కేటీఆర్ రియాక్షన్

రైతు సమస్యలతో పాటు బనకచర్లపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ విసిరిన సవాల్ పై కేటీఆర్ స్పందించారు. మా పార్టీ తరపున సవాల్‌ స్వీకరిస్తున్నామని చెప్పారు. ఎక్కడ చర్చ పెట్టినా వస్తామమన్నారు.ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని ప్రతి సవాల్ విసిరారు. మీడియా ముందే చర్చిద్దామన్నారు.

కేటీఆర్ (ఫైల్ ఫొటో)

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి స్ఖాయికి కేసీఆర్ అవసరం లేదని…తామే చాలని వ్యాఖ్యానించారు. రైతు సమస్యలపై రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా తాము సిద్ధమన్నారు. అసెంబ్లీ అయినా సరే వస్తామని చెప్పారు. అయితే దమ్ముంటే ఈనెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని… అక్కడే మీడియా ముందు చర్చిద్దామని ప్రతి సవాల్ విసిరారు.

“నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని ప్రిపేర్ అయ్యి చర్చకు రా. లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లను…. బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది. నీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు కానీ.. ఆయన ముచ్చట పడుతుండు కాబట్టి బనకచర్ల పై ఎపుడైనా, ఎక్కడైనా చర్చకు మేము రెడీ. పార్టీ తరపున నేనే మాట్లాడుతా. మేమెప్పుడు ప్రిపేర్ అయ్యే ఉంటాం. కాకుంటే వాళ్ళు ప్రిపేరవ్వాలి కాబట్టి 72 గంటలు టైమ్ ఇస్తున్నాం” అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.

“చంద్రబాబు నాయుడి కోవర్టు రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఏలుతున్నాడు. నిజాలు మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు కోవర్టు పాలన. రేవంత్ రెడ్డిని ముందు కొడంగల్లో జెడ్పీటీసీలను గెలిపించుకోమను. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి రైతుబంధు వెయ్యడు. రైతులకు ఎకరానికి రూ.15 వేలు, మూడు పంటలు వేస్తానని అన్నాడు.. ఎవరికైనా పడ్డాయా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

“స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు రైతుభరోసా డబ్బులు వేశాడు.. ఎన్నికలు అయిపోయాక రైతుబంధుకు రాం రాం. నాలుగు పంటలు కలిసి అసలు పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టాడు. రైతు రుణమాఫీ రూ.38 వేల కోట్లు ఎగగొట్టిండు.. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తే, రేవంత్ రెడ్డి ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు” అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.