KTR ED investigation : ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్.. భారీగా మోహరించిన పోలీసులు
KTR ED investigation : మాజీమంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఆయన గచ్చిబౌలి లోని తన నివాసం నుంచి బయలుదేరి.. నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు.
ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా..
ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. దీనిపై కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
'మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేస్‌ను హోస్ట్ చేయడం.. నాకు అత్యంత ఇష్టమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ ప్రతినిధులు మన నగరాన్ని ప్రశంసిస్తున్నప్పుడు.. నేను అనుభవించిన గర్వం చిరస్మరణీయమైనది. ఎన్ని పనికిమాలిన కేసులు పెట్టినా.. బురదజల్లే రాజకీయాలు చేసినా.. ఆ గర్వాన్ని తగ్గించలేవు' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బ్రాండ్ హైదరాబాద్ ముఖ్యం..
'నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు.. ఎల్లప్పుడూ ఫార్ములా ఈ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. అటువంటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి రాష్ట్రం పట్ల నిజమైన ప్రేమ అవసరం. పారదర్శకంగా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కి రూ. 46 కోట్లు చెల్లించారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. ప్రతి రూపాయికి లెక్క ఉంది' అని కేటీఆర్ స్పష్టం చేశారు.
త్వరలో నిజాలు తెలుస్తాయి..
'ఆరోపించిన అవినీతి, దుర్వినియోగం, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న చూపు చూడటం, ఆయన ఆలోచనా రహితంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. ఏ తప్పు జరగకపోయినా, దురుద్దేశంతో, రాజకీయ ప్రతీకారంతో ఈ కేసు పెట్టారు. కోర్టులు, దర్యాప్తు సంస్థల ద్వారా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. న్యాయస్థానాలతో సహా అందరికీ కనిపించేలా నిజం త్వరలో వెల్లడి అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. అప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాము' అని కేటీఆర్ స్పష్టం చేశారు.