BRS Fighting: బీఆర్ఎస్ పోరుబాట... రైతు సమస్యలపై సంజయ్ పాదయాత్ర… దళిత బంధు కోసం కౌశిక్ రెడ్డి ఆందోళన-brs political fight begins sanjay on farmers problems ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Fighting: బీఆర్ఎస్ పోరుబాట... రైతు సమస్యలపై సంజయ్ పాదయాత్ర… దళిత బంధు కోసం కౌశిక్ రెడ్డి ఆందోళన

BRS Fighting: బీఆర్ఎస్ పోరుబాట... రైతు సమస్యలపై సంజయ్ పాదయాత్ర… దళిత బంధు కోసం కౌశిక్ రెడ్డి ఆందోళన

HT Telugu Desk HT Telugu
Nov 13, 2024 05:45 AM IST

BRS Fighting: ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పోరు బాట పట్టింది.కాంగ్రెస్ 11 నెలల పాలనలో లోపాలను ఎత్తు చూపుతూ నెరవేరని హామీలను ప్రస్తావిస్తూ ప్రజా పోరాటం చేస్తుంది. హుజురాబాద్ ఎమ్మల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు కోసం ఆందోళన చేస్తే, రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాదయాత్ర నిర్వహించారు.

పోరుబాట పట్టిన బీఆర్‌ఎస్‌
పోరుబాట పట్టిన బీఆర్‌ఎస్‌

BRS Fighting: ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టే పనిలో నిమగ్నమయ్యింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలపై సమరశంఖం పూరించారు. దళిత బంధు రెండో విడత నిధులు వెంటనే విడుదల చేయాలని హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళితులతో కలిసి రెండు రోజుల క్రితం ఆందోళనకు దిగారు.‌

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు బిఆర్ఎస్ తో పాటు దళితులకు మద్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గాయాలపాలయ్యారు. ఈనెల 20 లోగా దళిత బంధు రెండో విడత నిధులు విడుదల చేయకుంటే రణరంగమే సృష్టిస్తామని హెచ్చరించారు.

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర

రైతు సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మహా పాదయాత్ర చేపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల నుంచి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రలో ఎమ్మెల్యే సంజయ్ తో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. సంజయ్ కి సంఘీభావంగా పాదయాత్రలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతు సమస్యలపై ఏకరువు పెడుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని, ఎకరాకు 15 వేల చొప్పున రైతు బంధు ఇవ్వాలని, రైతుల పండించిన అన్ని పంటలకు బోనస్ 500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించక పోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకుని ఒక జగిత్యాల జిల్లాలోనే వంద కోట్ల వరకు నష్టపోయారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా రైతు సమస్యలపై దృష్టి పెట్టి అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలవాలని డిమాండ్ చేశారు.

పరిహారం కోసం రామగుండంలో నిరాహార దీక్ష

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చి వేసిన ఇళ్ళకు, దుకాణాలకు పరిహారం ఇవ్వాలని రామగుండంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని... గోదావరిఖని, ఎన్టీపీసీ లో రోడ్డు వెడల్పులో ఇళ్ళు, దుకాణాలు కోల్పోయిన వారికి తగిన పరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని డిమాండ్ చేశారు. లేనిచో దశల వారీగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది ట్రైలర్ మాత్రమే... 75 MM సినిమా చూపిస్తాం-హరీష్ రావు

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దళిత బంధు ఆందోళన, రామగుండంలో నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని మున్ముందు 75 MM సినిమా సీఎం రేవంత్ రెడ్డికి చూపిస్తామని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తరాజులో పెట్టి కొన్నట్లు కాదు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి పాపాత్ముడు...క్షమించి ప్రజల్ని, రైతులను కాపాడుమని దేవుడిని వేడుకుంటున్నానని హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బాండ్ పేపర్ లు, పార్లమెంట్ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుని అబద్దపు హామీలతో ఇచ్చి ప్రతి ఒక్కరిని మోసం చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. రోజుకో చోట బిఆర్ఎస్ ఆందోళనలు ఎటువైపు దారితీస్తాయోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner