బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహణపై ఇంకా అడ్డంకులు తొలగలేదు. సభ నిర్వహణకు ఇంకో 15 రోజుల సమయమే ఉండగా, ఇంతవరకు వరంగల్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు హై కోర్టు మెట్లెక్కారు. ఈ మేరకు శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు బీఆర్ఎస్ సభకు పర్మిషన్ విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పర్మిషన్ జాప్యంపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద రజతోత్సవ మహా సభకు పార్టీ అధిష్ఠానం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎల్కతుర్తి, చింతల పల్లి గ్రామాల మధ్య ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. అక్కడి రైతులతో మాట్లాడి సభ నిర్వహణకు నిరభ్యంతర పత్రాలు కూడా తీసుకున్నారు. ఈ మేరకు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, ఇతర విషయాలతో సభ నిర్వహణకు పర్మిషన్ కోసం పార్టీ నేతలు వరంగల్ పోలీసులను ఆశ్రయించారు.
ఇందులో భాగంగా మార్చి 28వ తేదీతో పాటు ఏప్రిల్ 4వ తేదీన వరంగల్ పోలీసులకు వినతి పత్రాలు ఇచ్చారు. రెండు సార్లు వినతి పత్రాలు ఇచ్చినా వరంగల్ పోలీసులు అనుమతుల విషయంపై నిర్ణయం తీసుకోకపోవడంతో అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీ నేతలు న్యాయ పోరాటం మొదలు పెట్టారు. ఈ మేరకు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హై కోర్టును ఆశ్రయించారు.
బీఆర్ఎస్ నేతల పిటిషన్ మేరకు శుక్రవారం హై కోర్టు విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో దాదాపు 1300 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ఈ మేరకు సంబంధిత భూ యజమానుల నుంచి అంగీకార పత్రాలు కూడా తీసుకున్నామని తెలిపారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపించారు.
సభ నిర్వహణకు అనుముతులు ఇచ్చే విషయంలో ఇంకా కొన్ని అంశాలు పరిశీలించాల్సి ఉందన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికతో పాటు శాంతి భద్రతల సమస్యలు, పార్కింగ్, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని సందేహాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ పిటిషనర్ కు నోటీసులు చేశారని, దానికి వారు సమర్పించిన వివరణను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
కాగా ఇంకో పది హేను రోజుల్లోనే సభ నిర్వహించాల్సి ఉండగా, అనుమతుల విషయంలో నేతల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 17వ తేదీన మరోసారి విచారణ జరగనుండగా, హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో చూడాలి.