MLC Kavitha Probe : ఎల్లుండి విచారణకు హాజరవుతానని ప్రకటించిన కవిత-brs mlc kavitha will attend enforcement directorate enquiry on march 11th in delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Mlc Kavitha Will Attend Enforcement Directorate Enquiry On March 11th In Delhi

MLC Kavitha Probe : ఎల్లుండి విచారణకు హాజరవుతానని ప్రకటించిన కవిత

HT Telugu Desk HT Telugu
Mar 09, 2023 08:00 AM IST

MLC Kavitha Probe ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఎల్లుండి విచారణకు హాజరవుతానని కవిత ప్రకటించారు. ఇప్పటికే కవిత ఢిల్లీ చేరుకున్నారు, ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో గడువు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ నెల 11న విచారణకు రావాలని ఈడీ అధికారులు సూచించారు.

11న ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత
11న ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Probe ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఎల్లుండి హాజరు కానున్నారు . మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కవిత జంతర్‌ మంతర్‌లో ఆందోళన చేపడుతున్న సమయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులు కక్ష పూరితమని బిఆర్‌ఎస్‌ వాదిస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగా కవితకు ఈడీ నోటీసులు జారి చేయడంపై అభ్యంతరం చెబుతున్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని ఈడీకి కవిత సమాచారం ఇచ్చారు. కవిత విజ్ఞప్తి నేపథ్యంలో ఈ నెల11న విచారణకు హాజరు కావాలని ఈడీ కవితను ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నిస్తున్నారు. తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు మరియు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని ఆమె చెప్పడంతో ఈడీ 11న రావాలని సూచించింది.

మరోవైపు ఈ వ్యవహారంలో హడావిడిగా దర్యాప్తు చేయడం ఏమిటని ఈడిని కవిత నిలదీశారు. స్వల్ప వ్యవధిలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని తన లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని కవిత విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు. సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు.

దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైన అన్ని హక్కులను తాను ఉపయోగించు కుంటానని కవిత తేల్చి చెప్పారు. విచారణ విషయలో గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉందని, అయినా నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని గతంలో కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఈడీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు.

అరెస్ట్‌ చేస్తారనే అనుమానాలు….

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పేరు తొలిసారి గత ఏడాది ఆగష్టులో బయటకు వచ్చింది. లిక్కర్ పాలసీలో కవిత పేరును బీజేపీ నేతలు ప్రముఖంగా ప్రస్తావించారు. అప్పట్లో ఈ ఆరోపణల్ని కవిత ఖండించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఈ వ్యవహారం సద్దుమణిగినా సిబిఐ, ఈడీ దర్యాప్తుల్లో ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పటికే 11మంది అరెస్ట్ అయ్యారు. సౌత్ గ్రూప్‌లో కవిత తరపున తాను ప్రతినిధిగా వ్యవహరించానని అరుణ్ రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసులో కవిత అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ చేస్తారనే అనుమానంతోనే వీడియో కాన్ఫరెన్స్‌, ఇంట్లో విచారణ అంశాలను కవిత తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. ఈడీ కార్యాలయానికి వెళ్లిన తర్వాత అట్నుంచి అటే అరెస్టులు చేస్తుండటంతో ఏమి జరుగుతుందోననే ఆందోళన బిఆర్‌ఎస్ వర్గాల్లో ఉంది.

WhatsApp channel