BRS MLC Kavitha : 'పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం... ఇంతకింత చెల్లిస్తాం' - ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో మాట్లాడిన ఆమె… తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని… ఇంతకింత చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక ఇంతకింత చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
లెక్కలు తేలుస్తామ్ - ఎమ్మెల్సీ కవిత
రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటారని… కానీ తెలంగాణలో రేవంత్‌రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్ లో చిన్న పోస్ట్ పెడితే కూడా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. తాము కూడా లెక్కలు రాసి పెట్టుకుంటామని… అందరి లెక్కలు తేలుస్తామన్నారు.
బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకుంటే కుదరదని కవిత వ్యాఖ్యానించారు. ఒక బిల్లు కాదు.. మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలన్నారు. విద్యలో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు పెట్టాలన్న కవిత… ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లకు మరొక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
42 శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరొక బిల్లును పెట్టాలన్నారు. “బిల్లు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తేనే ఎన్నికల్లో రిజర్వేషన్లు సాధ్యమవుతాయి కానీ జాప్యం చేసి ఇతరులు కోర్టుకు వెళ్లేలా అవకాశం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు నిర్దిష్టమైన సమాచారం ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమాలకు దిగొచ్చిన ప్రభుత్వం బీసీ బిల్లు పెడుతామని ప్రకటించింది ఇది బీసీలందరి విజయం.. ఇది తొలి విజయం మాత్రమే” అని కవిత చెప్పారు.
నెలపాటు సమయం ఇవ్వాలి - కవిత
“కాంగ్రెస్ ధోకేబాజ్ పార్టీ.. మాటలు చెప్పి మోసం చేయడం ఆ పార్టీకి అలవాటు. మళ్లీ కుల సర్వేకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. 15 రోజుల కాకుండా నెల రోజుల పాటు సమయం ఇవ్వాలి. హైదరాబాద్ లో 60 శాతం మంది తమ ఇళ్లకు సర్వే చేసే వారు రాలేదని అంటున్నారు. రీ సర్వేపై ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. టోల్ ఫ్రీ నెంబరును విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
సంబంధిత కథనం