'ఆ లేఖ రాసింది నిజమే... బయటకు రావటం వెనక కుట్ర' - కవిత సంచలన వ్యాఖ్యలు-brs mlc kavitha reached hyderabad from usa reaction about her letter to kcr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'ఆ లేఖ రాసింది నిజమే... బయటకు రావటం వెనక కుట్ర' - కవిత సంచలన వ్యాఖ్యలు

'ఆ లేఖ రాసింది నిజమే... బయటకు రావటం వెనక కుట్ర' - కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమెకు… అనుచరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె… రెండు వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేశారు. లేఖ బయటికి రావటం వెనక కుట్ర ఉందని ఆరోపించారు.

ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె… కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించారు. రెండు వారాల క్రితం లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేశారు. కానీ అంతర్గత లేఖ బయటికి రావటం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ గారు దేవుడన్న కవిత…ఆయన చుట్టు దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోవర్టుల పనే - ఎమ్మెల్సీ కవిత

“రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు. నా వ్యక్తిగత అజెండా లేదు. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది….? లేఖ లీక్‌ చేసింది పార్టీలోని కొందరు కోవర్టులే” అంటూ కవిత ఆరోపించారు.

“కేసీఆర్‌ దేవుడు.. కానీ కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. అతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి?.. నా లేఖే బయటకు వచ్చిదంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి..?” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.

మా నాయకుడు కేసీఆర్ - కవిత క్లారిటీ

“కేసీఆర్ కు ప్రతిసారి లేఖలు రాస్తాను. కానీ ఈసారి బయటికి రావటం బాధాకారం. కుటుంబం, పార్టీ ఐక్యంగానే ఉన్నాయి. మా నాయకుడు కేసీఆర్. ఇందులో ఎలాంటి ఆలోచన లేదు” అని కవిత స్పష్టం చేశారు.

"బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణను ఫెయిల్‌ చేశాయి. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్‌ నాయకత్వమే. కేసీఆరే మా నాయకుడు… కేసీఆర్‌ నాయకత్వంలోనే పని చేస్తాం. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్‌ ఉంటుందని నా అభిప్రాయం" అని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు.

అసలేం జరిగిందంటే…?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… పార్టీ అధినేత కేసీఆర్ కు ఓ లేఖ రాశారు. ఎల్కతుర్తి సభ పూర్తి అయిన తర్వాత రాసిన ఈ లేఖ… గురువారం వెలుగులోకి వచ్చింది. ఆమె విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో లేఖ బయటికిరావటంతో…. పార్టీలోనే అతిపెద్ద కలకలం సృష్టించినట్లు అయింది. ఓ దశలో ఆ లేఖ నిజంగానే కవిత రాశారా…? లేదా…? అన్న ఉత్కంఠ అందరిలోనూ కలిగించింది. అయితే ఆ లేఖ తానే రాశానని తాజాగా కవిత క్లారిటీ ఇవ్వటంతో…. బీఆర్ఎస్ లోని విభేదాలు బయటపడినట్లు అయింది.

కవిత రాసిన లేఖలో కొన్ని పాజిటివ్, నెగిటివ్ అంశాలను ప్రస్తావించారు. పార్టీలోని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. లోపాలను సూటిగా చూపారు. ‘మై డియర్ డాడీ’ అంటూ మొదలైన లేఖ…మొత్తం ఆరు పేజీలుగా ఉంది.

కవిత లేఖలో పేర్కొన్న పాజిటివ్ అంశాలు:

  • డాడీ(కేసీఆర్)…. ఎల్కతుర్తి సభలో మీ ప్రసంగం కోసం క్యాడర్ అంతా చివరి వరకు వేచి ఉన్నారు.
  • సభలో ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడటం చాలా మందికి నచ్చింది.
  • కాంగ్రెస్ ఫెయిల్.. ఫెయిల్ అని చెప్పటం చాలా బాగుందని అనుకుంటున్నారు.
  • పహల్గాం అమరులకు మౌనం పాటించటం బాగుంది.
  • రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించి తిట్టకపోవటం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమల్ని రోజూ విమర్శిస్తున్నప్పటికీ… మీరు హుందాగా ఉన్నారని ఫీడ్ బ్యాక్ వచ్చింది.
  • తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలా మంది అనుకున్నారు.
  • తెలంగాణ తల్లి విగ్రహం మార్చటం, తెలంగాణ గీతం విషయాన్ని మీరు ప్రస్తావిస్తారని ఎదురుచూశారు.
  • ఓవరాల్ గా మీ నుంచి ఇంకొంచెం పంచ్ ఎక్స్ పెక్ట్ చేశారు. సభ విజయవంతం ద్వారా నేతలు, శ్రేణులు సంతృప్తి చెందారు.

నెగిటివ్ ఫీడ్ బ్యాక్ :

  • సభలో ఉర్దూలో మాట్లాడకపోవటం
  • వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడకపోవటం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించటం
  • ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం
  • ఇంత పెద్ద మీటింగ్ కు పాత ఇంఛార్జ్ లనే ఇచ్చారు. వాళ్లు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్ బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది.
  • మళ్లీ పాత ఇంఛార్జులకే లోకల్ బాడీ ఎన్నికల భీఫామ్ లను పార్టీ ఇస్తుందని ఇంఛార్జులు చెప్పుకుంటున్నట్లు కొన్ని దగ్గర్ల నుంచి తెలిసింది.
  • లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ కు పోటీ చేసే వాళ్లు రిలాక్స్ గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునేవాళ్లు ఇంఛార్జుల నుంచి కాకుండా పార్టీ ద్వారా భీపామ్ లు అందాలని కోరుతున్నారు.
  • మీరు సభకు చేరుకునేలోపు పార్టీలోని పలువురు నేతలకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలా మంది అన్నారు.
  • ధూం-ధామ్…. కార్యకర్తలను ఆకట్టుకోవటంలో ఫెయిల్ అయింది.
  • బీజేపీపై మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. వాళ్లతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారేమో అని ఊహాగానాలు మొదలయ్యాయి. పర్సనల్ గా నాకు కూడా బలంగా మాట్లాడాలని ఉండే. నేను వాళ్లతో బాధపడ్డాను కదా… అందుకని కావొచ్చు…! బట్ ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో.
  • కాంగ్రెస్ మీద క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. బీజేపీ అలర్ట్నెట్ అవుతుదేమో అన్న ఆలోచనను మన క్యాడర్ వ్యక్తపరుస్తోంది.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి సాయపడ్డాం అన్న సందేశాన్ని కాంగ్రెస్… ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.
  • చాలా మంది మీతో ఫొటోలు దిగాలని, చేయి కలపాలని అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది.
  • మీ యాక్సిస్ దొరకటం లేదని జెడ్పీటీసీ, జెడ్పీ ఛైర్మన్, ఎమ్మెల్యే స్థాయి నేతలు బాధపడుతున్నారు. సెలెక్టివ్ యాక్సిస్ అని ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కర్ని కలిసే ప్రయత్నం చేయండి.
  • ఇప్పటికైనా ఒకటి లేదా రెండు రోజులు ఫ్లీనరీ ఏర్పాటు చేయండి. కేడర్ కు దిశానిర్దేశం చేయండి. కొంచెం ఈ విషయం సీరియస్ గా ఆలోచించండి. “స్వారీ ఫర్ లాంగ్ లెటర్” అని కవిత తన లేఖలో పేర్కొన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం