MLC Kavitha On Sukeh leaks : సుఖేశ్ ఎవరో కూడా నాకు తెలియదు - ఎమ్మెల్సీ కవిత-brs mlc kavitha given clarity on chat with sukesh chandrasekhar in liquor case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha On Sukeh Leaks : సుఖేశ్ ఎవరో కూడా నాకు తెలియదు - ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha On Sukeh leaks : సుఖేశ్ ఎవరో కూడా నాకు తెలియదు - ఎమ్మెల్సీ కవిత

HT Telugu Desk HT Telugu

Sukesh Chandrasekhar Leaks: ఫేక్ చాట్ లతో తనపై మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన చాటింగ్ స్పందించిన కవిత... బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్సీ కవిత (facebook)

BRS MLC Kavitha On Sukesh Leaks: మనీలాండరింగ్ కేసులో ఉన్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో తనకెలాంటి పరిచయం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నకిలీ చాట్‌లతో తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ఈ మేరకు కవిత ఓ ప్రకటన విడుదల చేశారు.

బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్... బీజేపీ టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని చెప్పారు.

అసలు సుఖేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. "అతనెవరో కూడా నాకు తెలియదు. కానీ వాస్తవాలను ఏం పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో, పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయి. ఇదివరకు నా మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని,కేసీఆర్ మరియు కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా, అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు తయారైంది ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థల తీరు. ఇది అత్యంత దురదృష్టకరం" అని పేర్కొన్నారు.

పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరమన్నారు కవిత. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం.. అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారు అని తెలంగాణ సమాజం గ్రహించాలి..జాగ్రత్త పడాలని కోరారు కవిత. తెలంగాణ ప్రజలు విజ్ఞులు అన్న ఆమె.. పాలు ఏంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులని చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. తెలంగాణ బిడ్డలం తలవంచం.. తెగించి కొట్లాడుతాం అంటూ కవిత లేఖలో ప్రస్తావించారు.

సంబంధిత కథనం