MLC Kavitha: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మహిళకు మినహాయిపునివ్వాల్సి ఉన్నా ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత పిటిషన్‌లో అభ్యంతరం తెలిపారు.
MLC Kavitha: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడంపై స్టే ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసి పుచ్చింది. మహిళను ఇంటి వద్దే విచారించాలనే సిఆర్పీసీ నిబంధనలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తుందని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మార్చి 9న విచారణకు హాజరు కావాలని ఈడీ ఎమ్మెల్సీ కవితకు మొదట నోటీసులు జారీ చేసింది. మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఉన్న నేపథ్యంలో విచారణకు రాలేనని కవిత పేర్కొన్నారు. దీంతో కవిత ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరయ్యారు. 11వ తేదీన జరిగిన విచారణలో కవిత సెల్‌ఫోన్‌ను సైతం సీజ్ చేశారు.
16వ తేదీన మరోసారి ఈడీ విచారణకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈడీ తాజా నోటీసుల నేపథ్యంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత దానికి కొనసాగింపుగా మార్చి 15న ఢిల్లీలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలోని లే మెరేడియన్హోటల్లో రౌండ్‌టేబుల్‌సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఈడీ విచారణపై స్టే కోరుతూ పిటిషన్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను మార్చి16న ఈడీ అధికారులు మరోసారి విచారించనున్నారు. మార్చి 11న దాదాపు 9గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు, గురువారం మరోమారు విచారించనున్నారు.
మరోవైపు ఈడీ ఆఫీసులో మహిళను విచారణకు పిలవడంపై కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అభ్యంతరం తెలిపారు. తనకు ఇచ్చిన ఈడీ నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని, అందుకు విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని కవిత ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్లు సీజ్ చేశారని కవిత ఆరోపించారు. ఇంటికి వెళ్లి విచారించాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కవిత పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈడీ నోటీసులపై స్టే ఇవ్వడానికి నిరాకరించారు. మార్చి 24న కవిత పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు. దీంతో రేపటి ఈడీ విచారణ యథావిధిగా జరుగనుంది.