BRS MLC Kavitha : TSPSC ఛైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని తొలగించి, విచారణ జరిపించండి - ఎమ్మెల్సీ కవిత
BRS MLC Kavitha News: TSPSC ఛైర్మన్‌గా నియమితులైన మహేందర్‌రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి తీసివేయాలని కోరారు.
BRS MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె…. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. అలాంటి ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అయితే…. హైదరాబాద్ వేదికగా పలువురికి పత్రాలను అందజేయటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కారులో ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను తామేదో ఇచ్చినట్లు చెప్పుకోవటం ఎందుకు? అని ప్రశ్నించారు. అబద్ధాలను చెప్పటం మానేయాలని కోరారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పూర్తి చేస్తే… ఇవాళ కాంగ్రెస్ వాళ్లు నియామక పత్రాలను అందజేస్తున్నారని ఎద్దేవా చేశారు.
“ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ను బద్నాం చేసిన మీరు పారదర్శకంగా ఉండాలనుకుంటే అవినీతి ఆరోపణలు వచ్చిన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని రాజీనామా చేయించండి. ఆయనపై జ్యుడీషియల్ విచారణ జరిపించి, 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇక కమిషన్ లో ఆంధ్రా వ్యక్తిని సభ్యుడిగా ఎలా నియమించారు..? మహేందర్ రెడ్డి నియామకంపై గవర్నర్ ను కూడా కలుస్తాం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కూడా కమిషన్ మెంబర్ గా ఎలా నియమించారు..?” అని కవిత ప్రశ్నించారు.
“రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసు వాదించిన లాయర్లను సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డుగా నియమించారు. ఇదేం పద్దతి? ఇదేం న్యాయం? మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారి జేబులో నుండి జీతం ఇచ్చి, ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మును ఇస్తున్నారు. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా? కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ అంశంపై సీఎంను ఎందుకు నిలదీయడం లేదు?” అని నిలదీశారు.
విద్యుత్ సంస్థలో మొత్తం ఆంధ్రా వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించారని కవిత ఆరోపించారు. మొత్తం నలుగురు డైరెక్టర్లుగా నియమిస్తే… ఇందులో ముగ్గురు వ్యక్తులు కూడా ఆంధ్రా వ్యక్తులే ఉన్నారని వెల్లడించారు. తెలంగాణలో కరెంట్ కష్టాల వెనక ఆంధ్రా వ్యక్తుల కుట్ర ఉందని ఆరోపించారు కవిత. గత ప్రభుత్వంలో అడ్వజైర్లు ఉండొద్దని చెప్పిన రేవంత్ రెడ్డి… ఇవాళ ఎందుకు సలహాదారులను నియమించుకున్నారని కవిత ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో కూడా ప్రసన్న కుమార్ అనే ఆంధ్రా వ్యక్తిని కూడా సలహాదారుడిగా నియమించుకున్నారని ఆక్షేపించారు కవిత.
గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన నీతి వ్యాఖ్యలను ఇప్పుడు పాటిస్తే బాగుంటుందని కవిత హితవు పలికారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ విషయంపై దృష్టి పెట్టి… మహేందర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన పనులను కూడా మీరు కొత్తగా పనులను చేపట్టాలని సూచించారు.