MLA Rohit Reddy On BJP: బండి సంజయ్… తడి బట్టలతో ప్రమాణం చేసి నిరూపించు-brs mla pilot rohit reddy open challenge to bandi sanjay over notices in drugs case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Mla Pilot Rohit Reddy Open Challenge To Bandi Sanjay Over Notices In Drugs Case

MLA Rohit Reddy On BJP: బండి సంజయ్… తడి బట్టలతో ప్రమాణం చేసి నిరూపించు

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 02:16 PM IST

BRS MLA Rohit Reddy on ED notices:ఈడీ నోటీసులపై మరోసారి స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. బండి సంజయ్ కి సవాల్ విసిరారు. దమ్ముంటే భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేయాలన్నారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (twitter)

ED notice to MLA pilot Rohith Reddy: తెలంగాణలో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచేస్తున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే ఎర కేసు సంచలనం సృష్టించగా.. మరోవైపు లిక్కర్ కేసు, క్యాసినో వ్యవహరంపై ఈడీ ముమ్మర విచారణ చేస్తోంది. సీబీఐ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసింది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన విచారణ హాజరు కావాలని స్పష్టం చేసింది. అయితే ఈ నోటీసులపై తీవ్రంగా స్పందిస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. శనివారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే.. పూజలు చేసి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ కి సవాల్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రావాలి. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు వచ్చినట్లు చూపించాలి. నాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసు. నాకు కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ చూపించాలి. అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్నాను. నాకు కర్ణాటక నుంచి ఎటువంటి నోటీసు రాలేదు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నా పేరు లేదు. దమ్ముంటే బండి సంజయ్ రేపు ఆధారాలతో చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు రావాలి" అని అన్నారు.

బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కామెంట్స్ చేశారు రోహిత్ రెడ్డి. బీఆర్‌ఎస్‌కు భయపడి ఈడీ, సీబీఐ, ఐటీని పంపిస్తున్నారని చెప్పారు. నోటీసుల్లో బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. మీడియాతో మాట్లాడిన అనంతరం రోహిత్ రెడ్డి ప్రగతిభవన్ కు వెళ్లారు.

తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డితో సినీ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ కు శుక్రవారం ఈడీ నోటీసులు ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసులో నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. 2021లో బెంగళూరు పోలీసులు నమోదు చేసిన డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యాపారవేత్త కళహర్ రెడ్డితో కలిసి బెంగళూరులో డ్రగ్స్ పార్టీకి రోహిత్ రెడ్డి వెళ్లినట్లు నోటీసుల్లో పేర్కొంది. సినీ నిర్మాత శంకర్ గౌడ్ ఆ పార్టీ ఇచ్చినట్లు తెలిపింది. పార్టీ కోసం రూ. 4 కోట్ల విలువైన డ్రగ్స్ నైజీరియన్ల నుంచి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే తేల్చారు.

ఇదే కేసులో నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గతేడాది సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ అధికారులు విచారించారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని విచారణ మధ్యలోనే రకుల్‌ వెళ్లిపోవడంతో.. ఈడీ అధికారులు అమెను అప్పుడు పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. దీంతో మరోసారి విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుందని రెండు రోజుల క్రితమే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి నోటీసులు కూడా వచ్చాయని వెల్లడించారు. సంజయ్ ఈ వ్యాఖ్యలు చేసిన మూడో రోజే... రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు పంపడం.. సంచలనంగా మారింది.

IPL_Entry_Point