TGPSC Group 1 : గ్రూప్‌-1 పరీక్షలు, ఫలితాల్లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగింది.. పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు-brs mla padi kaushik reddy alleges scam in telangana group 1 results ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 : గ్రూప్‌-1 పరీక్షలు, ఫలితాల్లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగింది.. పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TGPSC Group 1 : గ్రూప్‌-1 పరీక్షలు, ఫలితాల్లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగింది.. పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TGPSC Group 1 : గ్రూప్‌-1 పరీక్షపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్‌-1లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగిందన్నారు. గ్రూప్‌-1 పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష రాయని 10 మందికి ఫలితాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

పాడి కౌశిక్‌ రెడ్డి

తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాలు దేశంలోనే పెద్ద కుంభకోణం అని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రిలిమ్స్ లో ఓ హల్ టిక్కెట్.. మెయిన్స్ లో మరో హాల్ టికెట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడే కుంభకోణం మొదలైందన్న కౌశిక్.. 21 వేల 93 మంది పరీక్షలు రాస్తే.. 21 వేల 103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్.. కీలక అంశాలను లేవనెత్తారు.

పేపర్లు ఎలా దిద్దారో..

'పది మంది అదనంగా ఎక్కడ్నుంచి వచ్చారు. తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలి. 654 మందికి ఓకే మార్కులు వచ్చాయి.. ఎలా సాధ్యం. పేపర్లు ఎలా దిద్దారో తెలియదు. నేను టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి సేకరించే మాట్లాడుతున్నా. పేపర్లు ఆరవై రోజుల్లోనే దిద్దారు. నాలుగైదు నెలలైనా సమయం పడుతుంది. పదివేల మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం 69 మందికే ఉద్యోగాలు వచ్చాయి. 1494 మంది మహిళలు పరీక్షలు రాసిన రెండు కేంద్రాల్లో.. 74 మందికి ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షా కేంద్రాలు 18 ,19 లో ఆ 74 మందికి ఉద్యోగాలు వచ్చాయి' అని కౌశిక్ వివరించారు.

ప్రత్యేక సెంటర్లు ఎందుకు..

'కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలికి 206 రాంక్ వచ్చింది. ఎస్టీల్లో ఆమెకు మొదటి ర్యాంక్ వచ్చింది. ఆమె సెంటర్ నెంబర్ 19లో పరీక్షలు రాసింది. 18 ,19 సెంటర్లు కోఠి ఉమెన్స్ కళాశాలలో ఉన్నాయి. ఆ సెంటర్లలో మహిళలకే అవకాశం ఇచ్చారు. మహిళలకే సెంటర్లు ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేశారు? ఉర్దూ మీడియంలో తొమ్మిది మంది పరీక్షలు రాస్తే.. ఏడుగురికి ఉద్యోగాలు వచ్చాయి. తెలుగు మీడియంలో ఏడు వేల ఎనిమిది వందల మంది రాస్తే.. 70 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంత తక్కువ ఎలా వస్తాయి?' అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు..

'పూజిత రెడ్డి అనే అభ్యర్థి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే మార్కులు తగ్గించారు. తెలంగాణ మూవ్ మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్‌లో 100 మార్కులు అని.. ప్రెస్ నోట్ లో ప్రకటించి 123 మార్కులు తర్వాత వేశారు. ఇదేమని అడిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి మార్కులు తగ్గించారు. బీజేపీ నేతలు ఈ స్కాం మీద ఎందుకు మాట్లాడటం లేదు. కేసీఆర్ హయంలో బీజేపీ నేతలు ఎగిరెగిరిపడ్డారు. అపుడు కేసీఆర్ పరీక్ష రద్దు చేశారు. ఇపుడు రద్దు చేయాలని బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు?' అని కౌశిక్ నిలదీశారు.

బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు..

'కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యాయి. బండి సంజయ్ హోం మంత్రిగా ఉన్నారు. గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై ఆయన సీబీఐ ఎంక్వయిరీ జరిపించాలి. గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి. న్యాయ విచారణ జరిపించాలి. రేవంత్ రెడ్డి, కోదండ రెడ్డి, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఉద్యోగాలు రాగానే.. నిరుద్యోగుల గురించి మరచిపోతారా? అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్‌కు అతిగతీ లేదు. ఏడాదికి 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లైబ్రరీ కి వచ్చి చెప్పిన రాహుల్ గాంధీ.. పత్తా లేకుండా పోయారు' అని కౌశిక్ రెడ్డి విమర్శించారు.

యువత గ్రహించాలి..

'తెలంగాణ పట్ల కేసీఆర్‌కున్న ప్రేమ.. ఢిల్లీ పార్టీలకు ఉండదని యువత గ్రహించాలి. కేసీఆర్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రూప్ వన్ పరీక్ష మీద ఎందుకు మాట్లాడటం లేదు? బీజేపీ నేతలు యాక్టింగ్ చేయడానికి అశోక్ నగర్ లైబ్రరీ వస్తే.. నిరుద్యోగ యువత తరిమి తరిమి కొట్టాలి. మా నేత రాకేష్ రెడ్డికి నోటీసులు పంపారు. మాకు ఎన్ని నోటీసులు పంపినా భయపడేది లేదు. గ్రూప్ వన్‌లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. భేషజాలకు పోకుండా గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలి' అని హుజురాబాద్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం