TG New Ration Cards : 11 లక్షల రేషన్ కార్డు అప్లికేషన్లు ఎక్కడ..? ఎందుకు పరిశీలించడం లేదు - హరీశ్ రావ్ ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లో జరగాలన్నారు. కానీ కులగణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి పంపడమేంటని ప్రశ్నించారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే దాని కంటే కోతలు ఎలా పెట్టాలనే విషయంపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. శనివారం తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆన్‌లైన్‌లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రజాపాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని... ఆ దరఖాస్తులు అన్నీ చెత్తబుట్టలో వేశారా అంటూ ప్రశ్నించారు.

ఎందుకు పరిశీలించటం లేదు..?
"11 లక్షల దరఖాస్తులు ప్రజాపాలనలో వస్తే ఎందుకు పరిశీలించడం లేదు. మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు..? కులగణన సర్వే చేసెటప్పుడు ఇది ఆప్షనల్, బలవంతం లేదు ఇష్టం ఉన్న వారు మాత్రమే పాల్గొనవచ్చు అన్నారు. ఇప్పుడు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అర్హులకు రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు" అని హరీశ్ రావు చెప్పారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డులును ఇచ్చామని హరీశ్ రావు గుర్తు చేశారు. “20,69,033 మంది లబ్ధిదారులకు అదనంగా రేషన్ ఇచ్చాం. నిరుపేదలకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఆదాయ పరిమితి సడలించాం. ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచన మాది. ఎక్కువ మందికి కోత పెట్టే ఆలోచన మీది” అంటూ ప్రభుత్వంపై హరీశ్ రావు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
"పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి రేషన్ కార్డుల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 2.55 లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో 3.40 లక్షలుగా సవరించి పెంచాలి. తద్వారా పేదలందరికీ లబ్ది చేకూరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా సర్కార్ నిర్ణయం వల్ల జర్నలిస్టులు, ప్రైవేటు ఉద్యోగులు, చిరు ఉద్యోగులు ఇలా ఎంతో మంది తెల్ల రేషన్ కార్డులు పొందారు. మేనిఫెస్టోలో మేము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యంను 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచడం జరిగింది" అని హరీశ్ రావు గుర్తు చేశారు.
“పది సంవత్సరాల క్రితం ఉన్న నిబంధనలో ఎలాంటి మార్పులు చేయకుండా, అవే నిబంధనలతో కొనసాగించడం వల్ల ఎన్నో కుటుంబాలు రేషన్ కార్డు అర్హత కోల్పోతున్నాయి. పేదలను రేషన్ కార్డులకు దూరం చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తోంది. 28వ తేదీ నుంచి గ్రామ సభల్లో రేషన్ కార్డుల గురించి ప్రశ్నించాలి. మళ్లీ దరఖాస్తులు పెట్టాలి అంటున్నారు. యాడాది కింద పెట్టిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటి రేవంత్ రెడ్డి..? షరతులు లేకుండా మీసేవ, ప్రజాపాలన, కుటుంబ సర్వే దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని అందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని” అని హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం