'ఏపీ జల దోపిడీపై ఎందుకు మాట్లాడటం లేదు..?' - రేవంత్ సర్కార్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు-brs mla harish rao power point presentation on banakacherla project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  'ఏపీ జల దోపిడీపై ఎందుకు మాట్లాడటం లేదు..?' - రేవంత్ సర్కార్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు

'ఏపీ జల దోపిడీపై ఎందుకు మాట్లాడటం లేదు..?' - రేవంత్ సర్కార్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. బనకచర్ల పేరుతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి దిగుతుంటే…. ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మౌనంగా ఉండటం వెనక ఉన్న కారణమేంటని నిలదీశారు. వెంటనే జలదోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

గజ్వేల్ సభలో హరీశ్ రావు (Facebook)

బనకచర్ల పేరుతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి దిగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. "బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి - కాంగ్రెస్ మౌనం" అంశంపై తెలంగాణ భవన్ లో ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు.

జల దోపిడీ చేస్తున్నారు - హరీశ్ రావ్

కృష్ణా జలాల్లో జలదోపిడి జరిగినట్లు, గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడి చేస్తున్నదని హరీశ్ రావు ఆరోపించారు. “సీఎం రేవంత్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. కేటీఆర్ మీద, బిఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంలో బిజీ ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పెడుతున్నారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మీ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? గోదావరి బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు..?” అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఎందుకు స్పందించటం లేదు…?

కృష్ణా నీళ్ళు తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడటం లేదని హరీశ్ రావు నిలదీశారు. “గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించటం లేదు. నిధులు, నదులు రెండు ఆంధ్రాకే. 8 మంది బిజెపి ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా మాట్లాడరు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి నోరు మెదపడం లేదు. 2 TMC బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారు. మరి నేడు 200 TMC ల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదు” అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోరాటం చేయండి… సహకరిస్తాం - హరీశ్ రావ్

“మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా రేవంత్? తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రాకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడు. కేంద్రంలో పరపతి తో చంద్రబాబు పై నుండి కాకుండా పోలవరం నుండి నీళ్ళు మళ్ళించి, కేంద్రం నుండి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నది. అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకావాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఏ రకమైన పోరాటంలోనైనా BRS కలిసి వస్తుంది. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తాం” అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని హరీశ్ రావు సూచించారు. “రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయ్. బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడండి. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోండి”అంటూ హరీశ్ రావు హితవు పలికారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.