Malkajgiri BRS Ticket : మల్కాజ్‍గిరిపై అదే ఉత్కంఠ - తెరపైకి మరో ముఖ్య నేత..!
Malkajgiri Assembly Constituency: మైనంపల్లి కామెంట్స్ చిచ్చు రేపిన నేపథ్యంలో మల్కాజ్ గిరి సీటుపై డైలామాలో పడింది బీఆర్ఎస్ హైకమాండ్. ఫలితంగా రేపోమాపో కొత్త అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించగా... కొత్తగా మరో సీనియర్ నేత పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచేసింది. ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించి… ఎన్నికల రేసులో టాప్ గేర్ వేసింది. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేసే పనిలో పడ్డారు టికెట్ దక్కించుకున్న నేతలు. మరోవైపు అసంతృప్త నేతలను కూడా లైన్ లోకి తీసుకొచ్చే పనిలో ఉంది అధినాయకత్వం. ఇదిలా ఉంటే మల్కాజ్ గిరి సీటు అంశంపై లోతుగానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ రావ్ టార్గెట్ గా మైనంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు చేయటంతో… పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. మైనంపల్లి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో…. ఇక్కడ కొత్త అభ్యర్థిని ఖరారు చేయాలనే యోచనలో ఉన్నట్లు గులాబీ వర్గాల మేరకు సమాచారం అందుతోంది.
ట్రెండింగ్ వార్తలు
మంత్రి హరీశ్ రావ్ పై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కేటీఆర్ తో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో మైనంపల్లిపై చర్యలకు సిద్ధమవుతోందట బీఆర్ఎస్ హైకమాండ్. హరీశ్ రావ్ పై చేసిన కామెంట్స్ పై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట! ఆయన్నుంచి వచ్చే రియాక్షన్ బట్టి వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన్ను పక్కనపెడితే అభ్యర్థిగా ఎవరిన్ని దించాలనే దానిపై కూడా గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే కసరత్తు షురూ చేశారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు కుత్బుల్లాపూర్ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్లను పరిశీలించారు. అయితే శంభీపూర్ రాజువైపు గులాబీ అధినాయకత్వం కాస్త మొగ్గు చూపినప్పటికీ… ఆయన ఆసక్తికరంగా లేరని తెలుస్తోంది. అంతేకాదు…కొద్దిరోజుల కిందట బీజేపీలో చేరిన ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇస్తారనే చర్చ కూడా నడిచింది. ఇవన్నీ ఇలా ఉంటే… అనూహ్యంగా మరో సీనియర్ నేత పేరును పరిశీలిస్తున్నారట..! ఇప్పుడు ఇదే గులాబీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెరపైకి మాజీ మేయర్…?
మైనంపల్లిపై వేటు వేయటం జరిగితే అక్కడ్నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో దింపే విషయంపై కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం ఆలోచిస్తుందట…! ఉప్పల్ టికెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్న ఆయనకు… ఈసారి కూడా టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో… ఉప్పల్ పక్క నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయట..! మేయర్ గా పని చేసిన కాలంలో… మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిచయాలు కలిసివస్తాయని… పైగా బీసీ సామాజికవర్గాని(మున్నూరు కాపు)కి మరో టికెట్ ఇచ్చినట్లు అవుతుందని పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఇవేకాకుండా… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా బొంతుకు పేరుంది. ప్రస్తుతం ఆయన భార్య జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా కూడా ఉన్నారు. ఇదే విషయంపై బొంతుతో కూడా పార్టీ పెద్దలు ప్రాథమికంగా చర్చలు జరిపారనే టాక్ వినిపిస్తోంది. అన్ని కుదిరితే… బొంతు రామ్మోహన్ కు ఛాన్స్ రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… మైనంపల్లిపై వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది. మరికొద్దిరోజుల్లోనే మీడియాకు ముందుకు వస్తానని మైనంపల్లి చెప్పారు. ఈ నేపథ్యంలో పునరాలోచన చేసిన హరీశ్ రావ్ కామెంట్స్ వ్యవహరంపై మైనంపల్లి యూటర్న్ తీసుకుంటారా..? లేక అంతలోపే బీఆర్ఎస్ హైకమాండ్ ఆయనపై వేటు వేస్తుందా..? అనేది కూడా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
సంబంధిత కథనం