BRS KTR At Chilukur: చిలుకూరుకు బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు పరామర్శ, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్-brs leaders in chilukuru balaji temple consult with chief priest rangarajan demand punishment of the accused ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Ktr At Chilukur: చిలుకూరుకు బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు పరామర్శ, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్

BRS KTR At Chilukur: చిలుకూరుకు బీఆర్‌ఎస్‌ నేతలు.. ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు పరామర్శ, నిందితుల్ని శిక్షించాలని డిమాండ్

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 10, 2025 01:31 PM IST

BRS KTR At Chilukur: చిలుకూరు బాలజీ ఆలయంలో అర్చకుడిపై దాడి ఘటన రాజకీయం రేపుతోంది. ఈ నెల 7వ తేదీ చిలుకూరు ఆలయంలో రంగరాజన్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చిలుకూరుకు బీఆర్‌ఎస్‌ నేతలు తరలి వెళ్లి అర్చకులను పరామర్శించారు.

చిలుకూరు ఆలయ అర్చకులను పరామర్శించిన కేటీఆర్‌, బీఆర్‌ఎస్ నేతలు
చిలుకూరు ఆలయ అర్చకులను పరామర్శించిన కేటీఆర్‌, బీఆర్‌ఎస్ నేతలు

BRS KTR At Chilukur:  చిలుకూరులో ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. రంగరాజన్‌ను  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో రెండు రోజుల క్రితం కొందరు సీఎస్. రంగరాజన్‌ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితికి ఈ దాడి సంఘటన నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాడి చేసిన వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టినా, వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. భగవంతుని సేవలో నిమగ్నమైన రంగరాజన్ కుటుంబ సభ్యులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

చిలుకూరు బాలాజీకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఉన్నారని, స్వామివారి సేవలో నిమగ్నమైన కుటుంబాన్ని అవమానించడం అంటే అది దేవుడినే అవమానించినట్టేనని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన కేటీఆర్, రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగరాజన్ కుటుంబ సభ్యులకు తాము పూర్తిస్థాయిలో అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు పార్టీ నాయకులు ఉన్నారు.

Whats_app_banner