Poilce Case On BRS Leader : సీఎం రేవంత్ పై సోషల్ మీడియాలో పోస్టింగ్..! బీఆర్ఎస్ నేతపై కేసు, ఫోన్ సీజ్-brs leader booked for social media post against telangana chief minister revanth reddy brother ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Leader Booked For Social Media Post Against Telangana Chief Minister Revanth Reddy Brother

Poilce Case On BRS Leader : సీఎం రేవంత్ పై సోషల్ మీడియాలో పోస్టింగ్..! బీఆర్ఎస్ నేతపై కేసు, ఫోన్ సీజ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 21, 2024 03:25 PM IST

BRS Leader Booked For Social Media Post:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసిన బీఆర్ఎస్ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ పోస్ట్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు మార్చి 16వ తేదీన కేసు నమోదైంది.

బీఆర్ఎస్ నేతపై కేసు
బీఆర్ఎస్ నేతపై కేసు

BRS Leader Booked For Social Media Post: : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానందరెడ్డి అంటూ ఓ అంశంపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసిన బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) నేత మన్నె క్రిశాంక్(Manne Krishank) పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యీ మహేశ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిశాంక్ పై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు క్రిశాంక్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు.

ఈ కేసుపై మన్నె క్రిశాంక్ స్పందిస్తూ… “టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు రూ. 3000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల రేవంత్‌ సోదరుడు అనుముల మహానందరెడ్డిపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు ఇందిరమ్మ పోలీసులు నా మొబైల్‌ను స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు” అని తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం… ట్విట్టర్ లో ఫేక్ పోస్టింగ్ కు సంబంధించి మార్చి 16వ తేదీన క్రిశాంక్ పై కేసు నమోదైనట్లు తెలిపారు. క్రిశాంక్ కు సెక్షన్ 41(ఎ) సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేసినట్లు మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. తదుపరి విచారణ కోసం మన్నె క్రిశాంక్‌కి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్‌ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

గతవారం ట్విట్టర్ లో మన్నె క్రిశాంక్ చిత్రపురి సొసైటీకి సంబంధించి ఓ పోస్ట్ చేశారు. ‘చిత్రపురి సొసైటీలో కోశాధికారి ఎవరో తెలుసా..? రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల మహానంద రెడ్డి’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఈ కేసుకు సంబంధించి క్రిశాంక్ బుధవారం(నిన్న) సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

ఫొటోలు ఉన్నాయి - మన్నె క్రిశాంక్

ఈ కేసుపై ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు మన్నె క్రిశాంక్(Manne Krishank). పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే నాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. చిత్రపురి కాలనీలో రూ. మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చి తన మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారని అన్నారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానంద రెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నారని… మహానందరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు వున్నాయని చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామా? అని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

“చట్ట ప్రకారం ఫోన్లను జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు వుంది. జ్యుడీషియల్ వారెంట్ వుంటేనే ఫోన్లు జప్తు చేయాలి. చిత్రపురిలో మూడు వేల కోట్ల కుంభకోణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా..? ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారు. మా ఫోన్లతో పాటు పీఏ, పీఆర్ఓల ఫోన్లను సైతం తీసుకుంటున్నారు. నా ఫోన్‌ను మాదాపూర్ పోలీసులు కోర్టుకు అప్పగించాలి. నా ఫోన్ పోలీసుల దగ్గర వుందా.. లేక రేవంత్ రెడ్డి దగ్గర ఉందా అనే అనుమానం వస్తోంది. డేటా గోప్యతపై సుప్రీం కోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చింది. వాటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం” అని క్రిశాంత్ చెప్పారు.

IPL_Entry_Point