బనకచర్ల కోసం డీపీఆర్ టెండర్లు పిలుస్తుంటే మీరేం చేస్తున్నారు..? సీఎం రేవంత్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు-brs harish rao slams cm revanth reddy over banakacharla project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బనకచర్ల కోసం డీపీఆర్ టెండర్లు పిలుస్తుంటే మీరేం చేస్తున్నారు..? సీఎం రేవంత్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు

బనకచర్ల కోసం డీపీఆర్ టెండర్లు పిలుస్తుంటే మీరేం చేస్తున్నారు..? సీఎం రేవంత్ కు హరీశ్ రావ్ ప్రశ్నలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావ్ ఫైర్ అయ్యారు. బనకచర్ల, ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.బనకచర్ల అప్రైజల్‌కు ఎలా వస్తుందని..? కేంద్ర జల మంత్రిత్వ శాఖ ఎట్ల స్వీకరిస్తుందని నిలదీశారు.

మాజీ మంత్రి హరీశ్ రావ్

ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని హరీశ్ రావ్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… బనకచర్ల తెలంగాణ పాలిట పెను ప్రమాదంగా మారబోతున్నదని వ్యాఖ్యానించారు. కేంద్ర బీజేపీ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు పోతోదని… అయినా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నరారని ఆరోపించారు. ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని దుయ్యబట్టారు.

“గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉందని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేసింది. ఇదే విషయంపై జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025 తేదీ నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిండు. దాదాపు 20 రోజులు దాటుతున్నా వ్యతిరేకించాల్సింది పోయి సహకరిస్తున్నడు. వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ జరగదు. ఇది సీడబ్ల్యూసీ, నదీ జలాల పంపీణీ నిబంధనలు. నికర జలాల మీద డీపీఆర్ ఉంటది, వరద జలాల మీద ఉండదు” అని హరీశ్ రావ్ చెప్పారు.

మనకు మిగిలేదేంటి..? హరీశ్

“సెప్టెంబర్ 17, 2025 నాడు కర్ణాటక ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అందులో ఏముంది.. 80, 100, 243 మొత్తంగా 423 టీఎంసీలు ఏపీ తీసుకువెళ్తే మాకు 112 టీఎంసీల నీళ్లు కృష్ణాలో ఆపుకుంటాం అని రాసింది.ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం, గోదావరి నీళ్లు తరలిస్తే.. మరుసటి రోజు నుంచి మీద నీళ్లు ఆపుతం అన్నారు. తెలంగాణ నష్టపోదా…? కింద గోదావరి, కర్ణాటక మీద కృష్ణా నీళ్లు ఆపితే తెలంగాణ పరిస్థితి ఏం కావాలి..? అంటే 423 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ అర్పణం, 112 టీఎంసీల కృష్ణా జలాలు కర్ణాటకకు అర్పణం అయితే తెలంగాణకు మిగిలేది ఏమిటి..?” అని హరీశ్ రావ్ ప్రశ్నించారు.

“తెలంగాణ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లాగా అయ్యింది. శాండ్ విచ్ లాగా తయారు అయ్యింది. ఏపీ మహారాష్ట్ర గోదావరి నీళ్లు తీసుకుపోతం అంటున్నరు. కర్ణాటక కృష్ణా నీళ్లు ఆపుతం అంటున్నది. నేను రాసిన లేఖలు కాదు, కర్ణాటక, మహారాష్ట్ర లేఖలు ఇవి. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్రాలు ముందుకు పోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నది.. మొద్దు నిద్ర పోతున్నదా..?”అని హరీశ్ రావ్ నిలదీశారు.

“ఏపీ మన నీళ్లు తన్నుకుపోతుంటే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పెదవులు మూసుకుంటారు. ఎనిమిది మరియు ఎనిమిది కలిస్తే గుండు సున్నానా? ఎంపీలు ఏం చేస్తున్నారు..? చంద్రబాబు ఒత్తిడికి బీజేపీ తలొగ్గుతున్నది. ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకు ఎందుకు వెళ్లడం లేదు”అని హరీశ్ రావ్ ప్రశ్నించారు.

“నిన్న ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం రూ. 9 కోట్లకు టెండర్లు పిలిచింది. ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, రాష్ట్ర భవిష్యత్ ఆగం అవుతుంది. బీజేపీకి రాష్ట్రానికి ఒక నీతి ఉంటదా? పోలవరం నేషనల్ ప్రాజెక్టు. 11,500 క్యూసెక్కులకే అప్రూవ్ అయ్యింది. 23 వేలకు తవ్వుతుంటే కేంద్రం ఎందుకు ఆపడం లేదు, నిబంధనలు ఉల్లంఘించి తవ్వుతుంటే బీజేపీ ఎందుకు నిధులు ఇస్తుంది” అని హరీశ్ రావ్ నిలదీశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం