BRS to Supreme Court : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌.. రెండు పిటిషన్లు దాఖలు-brs files 2 petitions in supreme court over party defections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs To Supreme Court : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌.. రెండు పిటిషన్లు దాఖలు

BRS to Supreme Court : పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌.. రెండు పిటిషన్లు దాఖలు

Basani Shiva Kumar HT Telugu
Jan 16, 2025 03:38 PM IST

BRS to Supreme Court : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పంచాయితీ ఢిల్లీకి చేరింది. బీఆర్ఎస్ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఏడుగులు ఎమ్మెల్యేలపై అనర్హతపై కారు పార్టీ అపెక్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావు హస్తినలోనే మకాం వేశారు.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ దాఖలు చేసింది. రెండు పిటిషన్లు దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌, కృష్ణమోహన్‌, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీపై బీఆర్ఎస్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దానం, తెల్లం వెంకట్రావు, కడియంపై ఎస్‌ఎల్పీ పిటిషన్ వేసింది. అటు మాజీ మంత్రి హరీష్‌ రావు ఢిల్లీలోనే ఉన్నారు.

హైకోర్టు ఆదేశాలు..

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తప్పదని ఇటీవల ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని.. అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా చర్యలు కూడా తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

66 సీట్లతో..

2023 శాసనసభ ఎన్నికల్లో 66 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. 39 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. బోటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. ఆరు నెలల్లో తామే తిరిగి అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే ప్రకటనలు చేశారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు.

రేవంత్ ఫోకస్..

ముందుగా తమకు ఒక్క ఎమ్మెల్యే సీటు దక్కని జంట నగరాలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఖైతరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. అదే మాదిరిగా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతరు డాక్టర్ కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ను బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ, ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ టికెట్ పై తన కూతురును ఎంపీగా గెలిపించుకున్నారు.

ఖమ్మం జిల్లా నుంచి..

మరో వైపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం భద్రాచలం. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకటరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రధానంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదులు చేసింది. స్పీకర్ స్పందించని కారణంగా హైకోర్టు మెట్లు ఎక్కింది.

అభివృద్ధి కోసమంటూ..

నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం అంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యగా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్షంలోకి దూకడం సర్వసాధారణంగా జరిగే పరిణామే. ఈ కారణంగా ప్రభుత్వాలు పడిపోయి కొత్త ప్రభుత్వాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మారింది వీరే..

లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. వీరే కాకుండా శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, యెగ్గె మల్లేషం, బొగ్గారపు దయానంద్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Whats_app_banner