KCR : రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది- కేసీఆర్-brs chief kcr sensational comments by election ban in telangana congress failed in rule ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr : రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది- కేసీఆర్

KCR : రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది- కేసీఆర్

KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో ఉపఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు.

త్వరలో ఉపఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోంది- కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR : తెలంగాణలో మళ్లీ వంద శాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై నేతలతో కేసీఆర్‌ చర్చించారు.

"తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలస వాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి"- కేసీఆర్

పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి, తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం పని చేయాలని సమావేశంలో పాల్గొన్న నాయకులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపధ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలని నిర్ణయించారు. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.

వందశాతం మళ్లీ అధికారంలోకి

తెలంగాణ ఉద్యమం, అభివృద్ధి కోసం చేసిన కృషిని కేసీఆర్ పార్టీ శ్రేణులకు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదన్నారు. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే తెలుసునన్నారు. బీఆర్ఎస్ వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలో ఉపఎన్నికలు

రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేచేపరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం