BRS KCR : పోరాటానికి సిద్ధమవ్వండి - వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం - కేసీఆర్
వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలని సూచించారు. పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి హాజరైన కేసీఆర్… ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాలని సూచించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్… కీలక అంశాలపై చర్చించారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అధికారంలోకి వస్తాం….!
పార్టీ స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలకు కేసీఆర్ సూచనలు చేశారు. పార్టీ ఏర్పాటు, ఈ సందర్భంగా ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలను గుర్తు చేశారు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని నేతలకు సూచించారు.
తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేసింది. గతం గాయాల నుండి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలస వాదుల బారిన పడకుండా చూడాలి. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి" అని కేసీఆర్ తెలిపారు.
పార్టీ సభ్యత్వ నమోదు…
“ప్రజల కోసం పార్టీ నేతలు పని చేయాలి. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు జరగాలి. ఈ ఏడాది పొడవునా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలి” అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయని… అందరూ సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.
ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని… పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ కమిటీలు వేయాలని నేతలను ఆదేశించారు. కమిటీలకు ఇంఛార్జ్‌గా హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించనున్నారు.
“విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలి. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలి” అని కేసీఆర్ సూచించారు.
సంబంధిత కథనం