BRS Kavitha : ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ - ఈ అంశాలపైనే ఫోకస్, కారణాలివేనా..!-brs chief kcr daughter kavitha back to active in telangana politics these are her top priorities ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Kavitha : ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ - ఈ అంశాలపైనే ఫోకస్, కారణాలివేనా..!

BRS Kavitha : ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ - ఈ అంశాలపైనే ఫోకస్, కారణాలివేనా..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 11, 2024 12:57 PM IST

KCR daughter Kavitha : కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి దిగారు. జాగృతితో పాటు పార్టీ నిరసన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.

జాగృతి నేతలతో  ఎమ్మెల్సీ కవిత సమావేశం (ఫైల్ ఫొటో)
జాగృతి నేతలతో ఎమ్మెల్సీ కవిత సమావేశం (ఫైల్ ఫొటో)

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. లిక్కర్ కేసులో చాలా రోజుల పాటు జైల్లో ఉన్న ఆమె… ఆగస్టు నెలలో తీహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 160 రోజులకుపైగా జైలు జీవితాన్ని గడిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత… కవిత ఇంటికే పరిమితమయ్యారు. పలు అనారోగ్య సమస్యలు ఉండటంతో చికిత్స తీసుకోవటంతో పాటు విశ్రాంతి తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే ఇటీవలే మళ్లీ కవిత యాక్టివ్ అయ్యారు.

తెలంగాణ జాగృతి ఏర్పాటుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కవిత… టీఆర్ఎస్ లో కీలక నేతగా ఎదిగారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ పరిణామం ఆమెకే కాదు… బీఆర్ఎస్ పార్టీని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కవిత విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఏ దిశగా అడుగులు వేస్తారనే చర్చ జోరుగా జరిగింది. నిజానికి అరెస్ట్ కంటే ముందే… కొన్ని అంశాలపై కవిత దృష్టిపెట్టారు. ముఖ్యంగా బీసీ కుల గణన, మహిళ రిజర్వేషన్ అమలు వంటి అంశాలపై పోరాటం చేశారు. ఢిల్లీ వేదికగా కూడా దీక్షలు చేశారు. మరోవైపు లిక్కర్ కేసులో విచారణ వేగవంతమైంది. దీంతో ఈడీ అధికారులు… కవితను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే.

జాగృతి బలోపేతం…!

జైలు నుంచి బయటికి వచ్చిన కవిత చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. అయికే కొద్దిరోజులుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఉద్యమ సమయంలో ఏర్పాటు జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా… జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల నేతలతో భేటీలు పూర్తయ్యాయి. త్వరలోనే జాగృతి కొత్త కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

బీసీల సమస్యలపై పోరాటం…!

ఇక బీసీల కుల గణనపై కవిత ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే… ఫూలే ప్రంట్‌ కూడా ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోనూ ఫూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కులగణనపై డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే బీసీ సంఘాల నేతలతో కలిసి వెళ్లిన కవిత…డెడికేటెడ్‌ కమిషన్‌ కు ప్రత్యేకంగా ఓ నివేదికను కూడా సమర్పించారు. బీసీ కుల గణనలో తీసుకోవాల్సిన చర్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కేలా, విద్య, ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచేలా సిఫార్సులు చేయాలని కవిత విన్నవించారు.

ఇదిలా ఉంటే… ప్రతిరోజు బీసీ సంఘాల నేతలతో కవిత సమావేశం అవుతూ వస్తున్నారు. బీసీల సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల హక్కుల కోసం భవిష్యత్తులో గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటం చేసే దిశగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. 

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ కవిత పాల్గొంటున్నారు. ఇటీవలే దీక్షా దివాస్ కు హాజరయ్యారు. ఇక ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావును అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించగా… అక్కడికి కూడా కవిత వెళ్లారు. హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను పరామర్శించారు. రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడిని కూడా పెంచుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహా మార్పుపై కూడా కవిత… ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సీఎం రేవంత్ రెడ్డికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లోని విగ్రహం వద్ద కవిత వినూత్న నిరసన తెలిపారు. హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు.

ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్… కాంగ్రెస్ సర్కార్ పై దూకుడుగానే ముందుకెళ్తోంది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీశ్ రావు… ప్రభుత్వంపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే…. కవిత కూడా రీ ఎంట్రీ ఇవ్వటంతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బీసీల సమస్యలతో పాటు పార్టీపరంగా కూడా కీలక కార్యక్రమాలు చేపట్టే దిశగా కవిత కార్యాచరణ ఉండబోతుందని పలువురు చెబుతున్నారు. తద్వారా బీసీలను ఆకర్షించవచ్చని యోచిస్తున్నారు. ఇదే బీఆర్ఎస్ పార్టీకి కూడా మైలేజ్ పెంచే అవకాశం ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి అంశాల వారీగా కవిత పోరాటం చేస్తారని తెలుస్తోంది..!

Whats_app_banner

సంబంధిత కథనం