హైదరాబాద్ : కేటీఆర్ పై కథనాలు - మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి...!-brs activists attack media tv office in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ : కేటీఆర్ పై కథనాలు - మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి...!

హైదరాబాద్ : కేటీఆర్ పై కథనాలు - మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి...!

ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు మహా టీవీ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లను ధ్వంసం చేశారు. కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలిపారు.

మహా టీవీ ఆఫీస్ పై BRS కార్యకర్తల దాడి

హైదరాబాద్ లోని మహా న్యూస్ మీడియా ఆఫీస్ పై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం శ్రేణులు దాడి చేశాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ అద్దాలు, కార్లను ధ్వంసం చేశారు. కార్యకర్తలు ఆఫీసులోకి ప్రవేశించి నిరసన తెలిపారు. ఈ పరిణామంతో ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఖండించిన ఏపీ సీఎం

మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు."హైదరాబాద్ లోని ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నాను" అని పేర్కొన్నారు.

“హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి.‌ మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కథనాలు,ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నాను” అని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. అదే క్రమంలో.. అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. నేటి రాజకీయాల్లో అన్నీ మెయిన్‌ స్ట్రీమ్‌కి తీసుకొచ్చారన్న ఆయన… బీఆర్ఎస్ సోదరులు సంయమనం పాటించాలని కోరారు. న్యాయ వ్యవస్థను నమ్ముకుందామని సూచించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.