ఏమి కష్టమొచ్చిందో ఏమో... గంటల వ్యవధిలో అన్నాచెల్లెలి ఆత్మహత్య
సంవత్సరం క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు తండ్రితో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏమి కష్టమొచ్చిందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇంధుప్రియాల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంవత్సరం క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు తండ్రితో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏమి కష్టమొచ్చిందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇంధుప్రియాల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ఆదివారం ఇంట్లో వ్యవసాయ బావి వద్దకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువతి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అనంతరం గంటల వ్యవధిలోనే అన్న పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఆమె మృతదేహం కూడా సోమవారం లభ్యమైంది. ఇద్దరు పిల్లలు ఒకేరోజు మృతి చెందడంతో తండ్రి శోక సంద్రంలో మునిగిపోయాడు. ఈ ఘటనతో ఇంధుప్రియాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పురుగుల మందు తాగి అన్న ... చెరువులో దూకి చెల్లి
ఇంధుప్రియాల్ గ్రామానికి చెందిన కాసులబాద్ క్రిష్ణయ్య, శ్యామల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు కళ్యాణి (16) ఉన్నారు. వీరి తల్లి సంవత్సరం క్రితం మరణించింది. దీంతో ఇద్దరు కుమారులు,కూతురు తండ్రితో కలిసి నివసిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం కూతురు కళ్యాణి వ్యవసాయ బావి వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బావి దగ్గరికి వెళ్ళిన కూతురు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతకగా ఆచూకీ లభించలేదు.
దీంతో పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం కళ్యాణి మృతదేహం సమీపంలోని మసిరెడ్డి కుంటలో లభ్యమైంది. కాగా పోలీసులు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం అన్న రాము (20) పురుగుల మందు తాగడంతో గాంధి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇద్దరు పిల్లలు ఒకేరోజు మృతి చెందడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.
సిద్దిపేటలో మరో ఘటన
చేపల వేటకు వెళ్లి జాలరి వాగులో గల్లంతైన సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తోటపల్లి గ్రామానికి చెందిన సందరి లక్ష్మణ్ (50) ఆదివారం సాయంత్రం తోటపల్లి జలాశయం సమీపంలో మత్తడి వద్ద కొంతమంది జాలర్లతో కలిసి చేపల వేటకు వెళ్లారు. మిగిలిన జాలర్లందరూ ఆటోలో రాగా, లక్ష్మణ్ సైకిల్ పై వెళ్ళాడు. అక్కడ చేపలు పట్టుకున్నాక మిగిలిన జాలర్లందరూ తిరిగి ఆటోలో ఇంటికి వెళ్లిపోయారు. కాగా సైకిల్ పై వస్తానని చెప్పిన లక్ష్మణ్ ఇంటికి రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన జాలర్లు అక్కడికి వచ్చి చూడగా సైకిల్ జలాశయం కల్వర్టు వద్ద ఉంది. ఆ కల్వర్టుపై వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లక్ష్మణ్ కల్వర్టు దాటుతుండగా వరదలో చిక్కుకొని గల్లంతై ఉంటాడని గ్రామస్థులు, కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికిన అతని ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందిన వెంటనే సిద్దిపేట ఏసిపి మధు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికిన అతని ఆచూకీ లభించలేదు. లక్ష్మణ్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.