Bridge Collapse: మళ్లీ కూలిన ముత్తారం- టేకుమట్ల వంతెన, నిలువెత్తు నిర్లక్ష్యం, బ్రిడ్జి నాణ్యతపై అనుమానాలు
Bridge Collapse: ఓ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఓసారి కూలిపోయింది. అదే బ్రిడ్జి నిర్మాణాన్ని పున: ప్రారంభించినా అదే తంతు నడుస్తోంది. రెండోసారి కూడా బ్రిడ్జి గడ్డర్లు కూలిపోయాయి.
Bridge Collapse: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్ళపల్లి గ్రామాల మధ్య మానేర్ వాగుపై నిర్మిస్తున్న వంతెన మరోసారి కూలింది. వంతెనపై గడ్డర్ల నిర్మాణానికి ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోయి కిందపడి ముక్కలయ్యాయి. రాత్రిపూట గైడర్లు కూలడంతో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
గత ఏప్రిల్ 22న అర్ధరాత్రి ఓడేడ్ వైపు పియర్స్ మధ్య ఏర్పాటు చేసిన గైడర్లు కూలిపోయాయి. ప్రస్తుతం గర్మిళ్లపల్లి వైపు నిర్మించిన 17, 18 పియర్స్ మధ్య ఏర్పాటు చేసిన 5 గైడర్లు కూలిపోయాయి.
రెండు జిల్లాల మద్య రాకపోకలకు మానేరు వాగుపై గత బిఆర్ఎస్ ప్రభుత్వం 49 కోట్లను బ్రిడ్జి నిర్మాణానికి మంజూరు చేసింది. 2016 ఆగస్టు నెలలో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. అనంతరం 2023 -24 లో మరొక 11 కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు. వంతెన నిర్మాణం పూర్తయితే రెండు జిల్లాల మధ్య దూరం తగ్గి రవాణాకు అనువుగా ఉంటుంది.
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం బ్రిడ్జి
అధికారుల నిర్లక్ష్యం పాలకుల పర్యవేక్షణ లోపానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది రెండు జిల్లాల మధ్య నిర్మించే వంతెన. పనులు ప్రారంభించి 8 ఏళ్లు పూర్తి కావస్తున్నా 50% పనులు కూడా పూర్తి కాలేదు. నాణ్యతా లోపంతో పనులు చేపట్టడంతో గత ఏడాది కురిసిన భారీ వర్షం వరదలకు కొంత కూలింది.
ఆ తర్వాత గత ఏప్రిల్ మాసంలో గాలి వానకి పిల్లర్లపై ఉన్న గైడర్లు కింద పడిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొద్దిగా వాటర్ వస్తుండగా తుప్పు పట్టిన గైడర్లు కిందపడిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తికాకముందే కుప్పకూలుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన ప్రక్కనే తాత్కాలిక మట్టి రహదారి నిర్మాణం చేసి ఇరువైపులా రాకపోకలు కొనసాగిస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మానేరు నదిలో నీటి ప్రవాహం పెరిగి రాత్రి సమయంలో రాకపోకలు తగ్గించారు.
భారీగా రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు తెలుపుతున్నారు. నిర్మాణం పూర్తికాకముందే నేలకొరుగుతుండడంతో నాణ్యత లోపం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లోపంతో నిర్లక్ష్యంగా బ్రిడ్జి నిర్మిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్)