Karimnagar Boy: కరీంనగర్ లో బాలుడు కిడ్నాప్...50 వేలకు విక్రయం, ముగ్గురు అరెస్టు... మరొకరు పరారీ-boy kidnapped in karimnagar sold for 50 000 three arrested one absconding ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Boy: కరీంనగర్ లో బాలుడు కిడ్నాప్...50 వేలకు విక్రయం, ముగ్గురు అరెస్టు... మరొకరు పరారీ

Karimnagar Boy: కరీంనగర్ లో బాలుడు కిడ్నాప్...50 వేలకు విక్రయం, ముగ్గురు అరెస్టు... మరొకరు పరారీ

HT Telugu Desk HT Telugu
Nov 05, 2024 05:58 AM IST

Karimnagar Boy: కరీంనగర్‌లో రెండున్నర ఏళ్ళ బాలుడు కిడ్నాప్ అయ్యాడు.బాబును ఎత్తుకెళ్లిన మహిళ మధ్యవర్తి ద్వారా 50 వేలకు విక్రయించింది. బాబు అదృశ్యంతో తల్లడిల్లిన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో రహస్యంగా విచారణ జరిపి బాబు కిడ్నాప్, విక్రయాన్ని ఛేదించి ముగ్గురిని అరెస్టు చేశారు.

బాలుడి కిడ్నాప్‌ కేసును చేధించిన పోలీసులు
బాలుడి కిడ్నాప్‌ కేసును చేధించిన పోలీసులు

Karimnagar Boy: కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల అక్టోబర్ 27న రెండున్నర ఏళ్ళ బాబు కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ చేసింది బాబు తల్లికి ఆశ్రయం కల్పించిన మహిళా కావడం విశేషం. బిక్షాటనతో జీవనం సాగించే షైక్ రేనా ను కరీంనగర్ చాకలి వాడలో నివాసం ఉండే దాసరి స్వరూప చేరదీసింది. షైక్ రేనా కు ఉన్న రెండున్నర ఏళ్ళ బాబుపై స్వరూప కన్నుపడింది.

బాబును ఆడిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్ళి మోతె కృష్ణ ద్వారా 50 వేల రూపాయలకు సంతానం లేని కరీంనగర్ లోని సవరన్ స్ట్రీట్ కు చెందిన సాధనవేణి లత రమేష్ దంపతులకు విక్రయించారు. బాబు కనిపించకపోయేసరికి తల్లడిల్లిన తల్లి షైక్ రేనా పోలీసులను ఆశ్రయించింది.

వన్ టౌన్ సిఐ బిల్లా కోటేశ్వర్ ఆద్వర్యంలో SI రాజన్న, కానిస్టేబుల్ కుమార్, భాషీర్ ప్రత్యేక టీం విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా బాబు ను ఎత్తుకెళ్ళి విక్రయించిన స్వరూప తోపాటు బాబును కొనుగోలు చేసిన లత రమేష్ దంపతులను అరెస్టు చేశారు. బాబు విక్రయం లో మధ్యవర్తిత్వం వహించిన మోతె కృష్ణ పరారీలో ఉన్నాడని ముగ్గురు సిఐ కోటేశ్వర్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు ప్రకటించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి బాబు

కిడ్నాప్ గురై అమ్మబడిన బాబును క్షేమంగా చేరదీసిన పోలీసులు, తల్లి ఒడికి చేర్చకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి అప్పగించారు. తల్లి షేక్ రేనా బిక్షాటన తో జీవనం సాగిస్తున్న నేపథ్యంలో బాబు క్షేమం కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని సిఐ తెలిపారు. తల్లి బాబు కావాలని కోరినప్పటికీ బాబు సేఫ్టీ దృష్ట్యా శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆద్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని చెప్పారు.

ఆగని పిల్లల్ల అమ్మకాలు

పిల్లల అమ్మకాలపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్న పిల్లల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. గత నెల అక్టోబర్ 22న వేములవాడలో పసిపాపను 90 వేల రూపాయలకు జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన మహిళలకు విక్రయించారు. దంపతులిద్దరూ కలిసి పాపను విక్రయించగా పాప ఏడబాటును తట్టుకోలేక తల్లి పోలీసులను ఆశ్రయించడంతో పసిపాప విక్రయం వెలుగులోకి వచ్చి విక్రయించిన దంపతులతో పాటు కొనుగోలు చేసిన మహిళ పై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు చేపట్టారు.

ఆ ఘటన మరిచిపోక ముందే కరీంనగర్లో బాబు కిడ్నాప్, విక్రయం వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తుంది. 2022 ఆగస్టులో అశోకనగర్ కు చెందిన ఓ బాలికను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయగా వన్ టౌన్ పోలీసులు 24 గంటల్లో పాప ఆచూకీ కనిపెట్టారు. 2023 ఫిబ్రవరిలో టూటౌన్ పరిధికి చెందిన ఓ మహిళ తన పొరుగింట్లో ఉండే ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి మహారాష్ట్ర తీసుకువెళ్ళడం అప్పట్లో కలకలం రేపింది. పిల్లల కిడ్నాప్ చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner